హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సపరిధిలోని చౌదరిగూడ మక్తాలో ఆదివారం తెల్లవారు జామున ఓఇంట్లో భారీ చోరి జరిగింది. రూ. 2కోట్ల నగదు మరియు 38 తులాల బంగారు ఆభరణాలును దొంగలు ఎత్తుకెళ్లారు. చౌదరిగూడ మక్తాకు చెందిన బైనగారి నాగభూషణం ఇటీవల శంకర్ పల్లిలోని తనకు చెందిన భూమిని అమ్మకానికి పెట్టాడు.
కొనుగోలు దారులు అడ్వాన్స్ రూ. 2కోట్ల ఇవ్వగా ఇంట్లో దాచివుంచారు. నాగ భూషణం ఆదివారం తెల్లవారు జామున ఇంటి తలుపులకు బయట నుంచి బేడం పెట్టేసి రోజు మాదిరిగానే పాలు పోసేందుకు నారపల్లి లోని ఫాంహౌసు వెళ్లాడు. ఇంతలో దొంగలు ఇంట్లోకి చొరబడి రూ. 2 కోట్ల నగదు, ఇంట్లో భద్రపరచి ఉన్న 38 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చిన నాగభూషణం ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన నాగభూషణం భార్య పద్మకు తెలిపారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తే కానీ అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ చక్రపాణి, పోచారం సీఐ రాజువర్మ తెలిపారు. భూమి అమ్మకానికి పెట్టినట్లు అడ్వాన్స్ గా డబ్బులు వచ్చాయని తెలిసిన వ్యక్తులే రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగభూషణం పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని వారు విదేశాలలో వ్యాపారాలు చేస్తూ అక్కడే ఉంటున్నట్లు తెలిపారు.