పాకిస్థాన్ సింధ్ రాష్ట్రంలోని ఉమర్కోట్ పట్టణంలో ఉన్న ప్రాచీన శివమందిరం హిందువుల ఆరాధనకు కేంద్రంగా నిలుస్తోంది. ‘శంభో శంకర’ నినాదాలతో ఆలయం ప్రతిరోజూ మార్మోగుతుండటం విశేషం. ఈ ఆలయం ప్రాచీన చరిత్రను, సాంస్కృతిక విలువలను కలగలిపిన పవిత్రస్థలంగా పరిగణించబడుతోంది. దేశ విభజనకు ముందే సింధ్ ప్రాంతంలో లక్షలాది హిందువులు నివసించేవారు. విభజన తర్వాత చాలా మంది భారత్కు వలస వచ్చినా, కొందరు మాత్రం అక్కడే స్థిరపడిపోయారు. ఇప్పటికీ పాక్లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నా.. కొద్దిమంది భక్తులతో కొద్ది ఆలయాలే కొనసాగుతున్నాయి. కానీ ఉమర్కోట్ శివాలయం మాత్రం చలికాలంలోనైనా, వేసవిలోనైనా భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ ప్రదేశానికి తొలి పేరు ‘అమర్కోట్’. ముస్లిం పాలకుల కాలంలో ‘ఉమర్కోట్’గా మారింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఇక్కడే జన్మించాడు. ఆలయానికి సంబందించిన క్షేత్ర పురాణం ప్రకారం, కొన్ని ఆవులు ఒక ప్రదేశానికి వెళ్లి పాలిస్తున్నాయని గమనించిన పశువుల కాపరి ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే.. శివలింగం ప్రత్యక్షమైందని చెబుతారు. అప్పటి నుంచి స్థానికులు అక్కడ శివపూజలు మొదలుపెట్టారు. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక విశిష్టత ఉంది. అది రోజురోజుకు పరిమాణంలో పెరుగుతుందనే విశ్వాసం ఉంది. మొదట శివలింగం చుట్టూ వేసిన వలయాన్ని దాటి పెరిగిన దృశ్యం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. నానాటికీ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా ఉమర్కోట్లో దాదాపు 80 శాతం హిందువులే నివసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మతసామరస్యానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా ఈ ప్రాంతం నిలుస్తోంది. పాక్లో హిందువుల కోసం చక్కటి ఉదాహరణగా నిలుస్తున్న ఉమర్కోట్ శివమందిరం, ఆ దేవాలయాన్ని నమ్మే వారికి భక్తి, విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. సంరక్షణ, భద్రతతో పాటు ప్రభుత్వ స్థాయిలో మరింత అభివృద్ధి చేస్తే ఇది అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందే అవకాశముంది.