తెలంగాణ అస్థిత్వ చిహ్నం బతుకమ్మ పండుగను.. వెయ్యేళ్ల నుంచే జరుపుకుంటున్నారు. మరి బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనకాల ఉన్న చరిత్ర ఏమిటి? బతుకమ్మకు సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ.. కొన్ని ప్రముఖంగా వినిపిస్తాయి. అవేంటంటే.. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద అనే రాజు పాలనలో బతుకమ్మ పండగ ప్రారంభమైందని చెబుతుంటారు. ఆ రాజు ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలు ఉండేవి. అయితే ధర్మాంగద రాజు దంపతులకు అనేక పూజలు, నోముల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. అయితే ఆమె ఎదుగుతున్న సమయంలో అనేక ప్రమాదాల బారినుంచి బయటపడింది. వరుస ప్రమాదాలు ఎదురవుతుండటంతో రాజు దంపతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే పండితుల సూచన మేరకు ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టగా.. ఆమె తనకు ఎదురవుతున్న గండాలను ఎదురించి జీవించిందని చెబుతారు. ధర్మాంగద రాజు పుట్టినరోజును పురస్కరించుకుని బతుకమ్మ పండగను జరుపుకుంటూ.. అమ్మవారిని పూజించేవారని చాలా మంది భక్తుల విశ్వాసం. చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద రాజు, సత్యవతి రాణి దంపతులు వారి వంద మంది కొడుకులను కోల్పోతారు. దీంతో వారు తమ కుమార్తెగా పుట్టమని లక్ష్మీదేవికి పూజలు చేశారు. అలా ఆ దంపతులకు ఓ ఆడశిశువు జన్మిస్తుంది. అప్పటి నుంచి ఆ శిశువును పండితులు బతుకమ్మ అని పిలిచి ఆశీర్వదించారు. అప్పటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్నట్లు మరో కథలో ఉంది. బతుకమ్మ పండుగ వేములవాడ ప్రాంతం నుంచి ఉద్భవించిందని పలు పురాణాలు చెబుతున్నారు. తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందినదిగా చెబుతారు. చోళరాజైన రాజరాజు పాలన కాలంలో వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని తంజావూరు తరలించి బృహదీశ్వరరాలయంలో ప్రతిష్టించాడని నమ్ముతారు. బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను.. అమ్మవారిని ఊరడించేందుకు, తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేసేందుకు మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఏటా బతుకమ్మను జరుపుతున్నారని మరో కథ వినికిడిలో ఉంది. దుర్గామాత భీకర పోరాటం చేసి మహిషాసురుడిని చంపింది. ఆ తర్వాత ఆమె ఆశ్వయుజ పాడ్యమి రోజున అలసట కారణంగా గాఢ నిద్రలోకి జారుకుంది. అయితే భక్తులందరూ ఆమెను మేల్కొలపాలని భక్తి, అంకితభావంతో ప్రార్థించారట. గౌరీ దేవికి ఇష్టమైన పూలను ఒకచోట పేర్చి ఆమె అనుగ్రహం కోసం సంబరాలు మొదలుపెట్టారని, దశమి రోజున ఆమె నిద్రలేచిందని భక్తుల విశ్వాసం. అలా బతుకమ్మ పండగ ప్రారంభమైందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది.