Karnimata Temple: ఆ ఆలయంలో వేల సంఖ్యలో ఎలుకలు.. వాటికే నైవేద్యం

Karnimata Temple: ఆ తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు ఆలయ అర్చకులు..

Update: 2022-01-10 12:00 GMT

Karnimata Temple: దేశంలో ఎన్నో దేవాలయాలు.. వాటిలో మరెన్నో ప్రత్యేకతలు.. సైన్స్‌కి కూడా అంతుబట్టని రహస్యాలు కొన్ని దేవాలయాల్లో ఉంటాయి. ప్రతి సంవత్సరం పెద్ధ సంఖ్యలు భక్తులు ఈ దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఇంట్లో ఒక ఎలుక తిరిగితేనే దాన్ని బయటకు పంపించిదాకా నిద్ర పట్టదు.. అలాంటిది ఆ దేవాలయంలో 25 వేల ఎలుకులు భక్తుల మాదిరిగా సంచరిస్తుంటాయి.. పైగా ఆలయాన్ని సందర్శించిన భక్తులే వాటికి నైవేద్యం పెడుతుంటారు.

రాజస్థాన్‌లోని కర్ణిమాతా ఆలయంలో అసలు ఇన్ని ఎలుకలు ఎందుకు ఉన్నాయి అనేది అత్యంత ఆశ్చర్యమైన విషయం. బికనీర్ నగరానికి దాదాపు 30 కిమీల దూరంలో ఉన్న ఈ ఆలయంలోని ఎలుకలకు భక్తులు వివిధ రకాల వంటకాలు నైవేద్యంగా పెడతారు. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు ఆలయ అర్చకులు.. మాత ఆలయానికి ఎవరు వచ్చినా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.



ఈ ఆలయాన్ని బికనీర్ రాచరిక రాష్ట్రానికి చెందిన మహారాజా గంగా సింగ్ నిర్మించారు. మాత కర్ణి దుర్గా మాత యొక్క నిజమైన అవతారం అని చెబుతారు. చరిత్రను పరిశీలిస్తే క్రీ.శ.1387లో మాత కర్ణి ఋఘుబాయి అనే రాజకుటుంబంలో జన్మించింది. వివాహానంతరం ఆమె జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రాపంచిక బంధాల పట్ల విరక్తి.. సన్యాసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది.

నిరంతరం ధ్యానంలో గడిపేది. ఆమెలో ఏదో అద్భుత శక్తి ఉందని అందరికీ తెలిసింది. దీంతో ఆమెను దర్శించుకునేందుకు దూరప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం ప్రారంభించారు. చాలా మంది చరిత్రకారులు మాతా కర్ణి దాదాపు 151 సంవత్సరాలు జీవించారని కూడా చెబుతారు. అప్పటి నుండి ఆమెను భక్తులు కర్ణిమాతా అమ్మవారిగా పూజిస్తున్నారు.



కర్ణిమాత ఆలయంలో 25 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి. ఈ ఎలుకలు మాతా కర్ణి వారసులని చెబుతారు. సాయంత్రం సమయంలో సంధ్యా హారతి జరిగినప్పుడు, ఎలుకలన్నీ వాటి బొరియల నుండి బయటకు వస్తాయి. ఇక్కడ ఎలుకలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆలయాన్ని మూషిక దేవాలయం అని కూడా అంటారు. 25 వేలకు పైగా ఎలుకలు ఉన్నప్పటికి ఈ ఆలయంలో ఎలాంటి దుర్వాసన రాకపోవడం గమనార్హం.



అదే సమయంలో, ఈ ఆలయంలో ఇప్పటివరకు ఎలుకల వల్ల ఎటువంటి వ్యాధి వ్యాపించలేదు. ఎవరూ అనారోగ్యం బారిన పడిన దాఖలాలు కూడా లేవు అని చెబుతారు ఆలయ పూజారులతో పాటు భక్తులు సైతం. ఎలుకల ద్వారా ఎన్నో వ్యాధులు వ్యాపిస్తాయంటారు.. కానీ ఇక్కడ అలాంటి సంఘటనలు ఏవీ జరగపోవడం గమనార్హం. అదే శాస్త్రవేత్తలకు అంతు బట్టని రహస్యం. 

Tags:    

Similar News