REOUBLIC DAY: ప్రజాస్వామ్య హృదయం.. మన రాజ్యాంగం
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణప్రతిష్ఠ చేసిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణప్రతిష్ఠ చేసిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన ఈ రాజ్యాంగం కేవలం చట్టాల సంకలనం మాత్రమే కాదు… కోట్లాది మంది ఆశలు, ఆకాంక్షలు, హక్కులు, బాధ్యతలకు ప్రతిబింబం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15వ తేదీ దేశ చరిత్రలో ఎంత ముఖ్యమో, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీ కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, భారత రాజ్యాంగానికి అధికారిక ఆమోదం లభించింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి రెండు నెలల ముందే. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయినప్పటికీ, చాలా సంవత్సరాల పాటు ఈ రోజును ప్రత్యేకంగా గుర్తించలేదు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత, రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రజల్లో మరింతగా చాటిచెప్పే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2015లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ స్వాతంత్య్రం కోసం వేలాది మంది ప్రజలు తమ ధన మాన ప్రాణత్యాగాలు చేశారు. ఇక, అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ.. జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అయితే, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే.. అయితే, దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్లతోనూ కాలక్షేపం చేస్తారు. కానీ, దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంత మంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంత మంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు? దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది? అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు బయటపడతాయి. భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్న తీరు కూడా అంతే విశిష్టమైనది. ఈ రాజ్యాంగాన్ని ముద్రణ యంత్రాలతో కాకుండా, పూర్తిగా చేతిరాతతో రూపొందించారు. ఈ అపూర్వమైన బాధ్యతను ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా అనే గొప్ప కాలిగ్రాఫర్ నిర్వర్తించారు.
భారత రాజ్యాంగం ఎంత విశాలమైందో దాని పరిమాణమే చెబుతుంది. ప్రపంచంలో ప్రస్తుతం అమల్లో ఉన్న అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం కాగా, అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగమే. దేశంలోని భాషలు, మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో విస్తృతంగా రూపొందించినందువల్లే ఇది ఇంత విస్తారంగా రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు అనేక ప్రశంసలు కురిపించారు. హెచ్వీ కామత్ భారత రాజ్యాంగాన్ని దేవేంద్రుని ఐరావతంతో పోల్చుతూ, అది బలమైనదని, విశాలమైనదని వ్యాఖ్యానించాడు. ప్రముఖ రాజ్యాంగ పండితుడు గ్రాన్ విల్లే ఆస్టిన్ భారత రాజ్యాంగాన్ని “అందమైన అతుకుల బొంత”గా అభివర్ణించాడు. అంటే, ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాల నుంచి మంచి అంశాలను తీసుకుని, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మలచిన గొప్ప కృషిగా ఆయన భావించాడు.