ప్రయాగ్‌రాజ్ హైవేపై బస్సు-కారు ఢీ.. కుంభమేళాకు వెళుతున్న 10 మంది భక్తులు మృతి

శనివారం తెల్లవారుజామున మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించారు.;

Update: 2025-02-15 05:45 GMT

శనివారం తెల్లవారుజామున మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించారు.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ నుండి భక్తులతో ప్రయాణిస్తున్న బస్సును మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై బొలెరో ఎస్‌యూవీ వాహనం బస్సును ఢీకొట్టడంతో 10 మంది మరణించారని పోలీసులు తెలిపారు.

బొలెరోలో ప్రయాణిస్తున్న వారందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భక్తులు, శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వైపు వెళ్తున్నారు. అర్ధరాత్రి తర్వాత బస్సు, ఎస్‌యూవీ ఢీకొన్న ప్రమాదంలో మరో 19 మంది గాయపడ్డారు. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న భక్తులు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందినవారు, శనివారం ఉదయం సంగంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి మహా కుంభమేళాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

యాదృచ్ఛికంగా, SUV ఢీకొన్న బస్సులో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. ఈ ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన 19 మందికి సరైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరణించిన యాత్రికుల మృతదేహాలను శవపరీక్ష కోసం స్వరూప్ రాణి వైద్య ఆసుపత్రికి తరలించారు.

మహా కుంభానికి వెళ్ళే లేదా తిరిగి వచ్చే భక్తులు ప్రమాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు మహా కుంభ యాత్ర ముగించుకుని ఇంటికి వెళుతుండగా, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో హైవేపై వారి టెంపో ట్రావెలర్ ట్రక్కును ఢీకొట్టడంతో మరణించారు. ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు భక్తులను కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశం అయిన మహా కుంభ్ జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి ఆ రోజే కుంభమేళా ఆఖరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News