హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి తిరుపతికి వెళ్తున్న అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం సాంకేతిక సమస్య కారణంగా అత్యవసరంగా తిరిగి ల్యాండ్ అయింది. ఈ ఘటన ఈరోజు (ఆగస్టు 19) ఉదయం జరిగింది. విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించారు. ATC అధికారులు అనుమతి ఇవ్వడంతో, పైలట్ చాకచక్యంగా విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను విమానం నుంచి దించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.