ప్రముఖ పర్సనాలిటీ డెవలప్ మెంట్ నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్‌లో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ మెజీషియన్ గా, మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్ ప్రసిద్ధి చెందారు. ఖైరతాబాద్‌లోని స్వగృహంలో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఉంచారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు సంతాపం తెలిపారు.
1984లో హైదరాబాద్‌లో కళ్లకు గంతలు కట్టుకుని రవీంద్రభారతి నుంచి చార్మినార్ వరకు స్కూటర్ నడిపి మెజీషియన్ గా కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యం చేశారు. హిప్నాటిజాన్ని తీసుకొచ్చి పలు జబ్బులను నయం చేయవచ్చని నిరూపించారు. దూరదర్శన్‌లో కొన్ని సీరియళ్లతో పాటు పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. పలు పత్రికల్లో బీవీ పట్టాభిరామ్ ఎన్నో వ్యక్తిత్వ వికాస వ్యాసాలు రాశారు.