Delhi pollution: కృత్రిమ వర్షాలు కురిపించాలని కేంద్రాన్ని కోరుతున్న ఆప్ ప్రభుత్వం
నగరంలోని చెడు గాలిని శుభ్రం చేసేందుకు కృత్రిమంగా వర్షాలు కురిపించాలని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.;
ఢిల్లీ మంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ మంగళవారం దేశ రాజధానిలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో కృత్రిమ వర్షాలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్య పరిస్థితిపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పదేపదే అభ్యర్థనలు చేసినా పట్టించుకోవడం లేదని రాయ్ ఆరోపించారు. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ 'నిద్ర'లో ఉన్నారని రాయ్ అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవలి రోజుల్లో AQI స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, ముఖ్యంగా సోమవారం AQI 493గా నమోదవడంతో, తీవ్రమైన గాలి నాణ్యత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి అధికమైంది.
“ఢిల్లీలో పొగమంచును ఎలా ఎదుర్కోవాలనే దానిపై మేము పలువురు నిపుణులను సంప్రదిస్తున్నాము. ఈ స్మోగ్ కవర్‌ను తొలగించి ప్రజలకు ఉపశమనం కలిగించే సమయం ఆసన్నమైందని మేము నమ్ముతున్నాము. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాస్తున్నాను. కృత్రిమ వర్షంపై పరిశోధనలు చేసిన ఢిల్లీ ప్రభుత్వం, ఐఐటీ-కాన్పూర్ నిపుణులు, సంబంధిత శాఖలన్నింటిని సమావేశానికి పిలిచి వెంటనే కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విషయంలోని తీవ్రతను బట్టి చర్య తీసుకోవడం వారి నైతిక బాధ్యత అని అన్నారు.