నాన్‌వెజ్ వంటలు ఘాటుగా ఉండాలంటే వెల్లుల్లి ఉండాల్సిందే. అయితే ధర మాత్రం అందుబాటులో లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్‌లో కేజీ ధర రూ.450కి చేరింది. పదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఇందోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా ప్రాంతాల్లో సాగు తగ్గడమే ధర పెరగడానికి కారణమంటున్నారు. గూడెం నుంచే గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు వెల్లుల్లి ఎగుమతి అవుతుంటుంది.
పదేళ్ల క్రితం అత్యధికంగా కిలో రూ.220 నుంచి రూ.350 వరకు చేరినట్టు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. తర్వాత అంత ఎక్కువగా ధర పెరగడం మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని చెబుతున్నారు. ధర పెరగడంతో ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌కు 25 నుంచి 50 టన్నుల లోపు సరుకు మాత్రమే వస్తున్నట్టు తెలిపారు. వారం రోజులుగా కొత్త పంట మార్కెట్‌లోకి వస్తుండటంతో నాణ్యతను బట్టి హోల్‌సేల్ ధర రూ.130 నుంచి రూ.280 వరకు ఉంది.