Godavari River : ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి.. సముద్రంలోకి నీరు విడుదల...
భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నదులు, డ్యామ్ లు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన అధికారులు...నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి సముద్రం వైపు పరుగులు తీస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరగడంతో.. ప్రాజెక్టు 85 గేట్లను ఎత్తి 9,89,620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.దిగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ 59 గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న 11,12,170 క్యూసెక్కుల వరదను దిగువకు తరలిస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 50.3 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన ఉన్న అన్ని బ్యారేజీల గేట్లను ఎత్తడంతో చివరన ఉన్న ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం పెరిగింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ అన్ని గేట్లను ఎత్తి 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉందని..మత్స్యకారుకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.