మంచు కుటుంబంలో వివాదంపై మనోజ్ స్పందించారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని మంచు మనోజ్ స్పష్టం చేశారు. తనను తొక్కేయడానికి భార్యా, పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమన్నారు. తనను అణగదొక్కేందుకు తన భార్యను బెదిరింపులకు గురిచేయడం.. తన ఏడునెలల పాపను దీనిలోకి లాగడం.. తన పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానని..తనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామనే వారు తన మనుషులను బెదరగొట్టి వేరే వాళ్లని లోపలికి పంపించారని మనోజ్ ఆరోపించారు. మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదంపై సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ మధ్య జల్‌పల్లిలోని నివాసంలో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం పెద్దల సమక్షంలో ఓసారి చర్చలు జరిగాయి. విదేశాల నుంచి విష్ణు తిరిగి రావడంతో ముగ్గురూ కలిసి చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. చర్చల అనంతరం అక్కడి నుంచి మనోజ్ వెళ్లిపోయారు.