Heavy Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య ,,వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే కొన్ని రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఆగస్టు 12న పసుపు రంగు హెచ్చరిక (yellow alert), ఆగస్టు 13న ఆరెంజ్ రంగు హెచ్చరిక (orange alert) జారీ చేశారు. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు వంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, నిర్మల్, బైంసా, మంచిర్యాల, భద్రాచలం వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.ఇటీవలి వర్షాల వల్ల తెలంగాణలో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రోడ్లు, భవనాలు, వ్యవసాయ, పురపాలక శాఖలకు ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.