రతన్ టాటాకు నివాళి.. జర్మనీలో కచేరీని నిలిపివేసిన పంజాబీ గాయకుడు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణవార్త విన్న పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ ఆయనకు నివాళులర్పించారు.;
రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో రతన్ టాటా సోమవారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ అతని మరణ వార్త విన్న తరువాత ప్రముఖ పారిశ్రామికవేత్తకు నివాళులర్పించారు.
జర్మనీలో జరుగుతున్న ఒక సంగీత కచేరీలో దిల్జిత్ పాటలు పాడుతున్నారు. అదే సమయంలో టాటా మరణ వార్త అతడి చెవిని చేరింది. దీంతో ఆ మానవతా మూర్తికి నివాళులు అర్పించేందుకు కచేరీని నిలిపివేశారు దిల్జిత్. రతన్ టాటా వారసత్వాన్ని గౌరవించడం కోసం దిల్జిత్ తన ప్రదర్శనను నిలిపివేశారు. టాటాను కలిసే అవకాశం తనకు ఎప్పుడూ రాలేదని, అయితే టాటా తన జీవితంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపించారని అన్నాడు.
దిల్జిత్ పంజాబీలో, “రతన్ టాటా గురించి మీ అందరికీ తెలుసు. ఆయన కన్నుమూశారు. ఆయనకు ఇదే నా నివాళి. ఈ రోజు, అతని పేరు స్మరించుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే అతను ఎల్లప్పుడూ కష్టపడి పనిచేశాడు. నేను అతని గురించి విన్నవి, చదివినవి చాలా ఉన్నాయి. అతను ఎవరి గురించి తప్పుగా మాట్లాడటం నేను చూడలేదు అని దిల్జిత్ తెలిపాడు.
"అతను ఎప్పుడూ ఇతరులకు సహాయకారిగా ఉన్నాడు. ఇది జీవితం, ఇలా ఉండాలి. అతని జీవితం నుండి మనం నేర్చుకోగలిగేది ఏదైనా ఉంటే, మనం కష్టపడి పనిచేయాలి, సానుకూలంగా ఆలోచించాలి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి. జీవితాన్ని పూర్తిస్థాయిలో జీవించాలి, ”అని దిల్జిత్ తెలిపాడు.