బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం నేడు సర్వసాధారణంగా మారిపోయింది. అలా తినేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఫాస్ట్ ఫుడ్ కారణంగా యువతలో మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. క్రియాటినిన్ స్థాయులు పెరుగుతున్నాయి. చాలామంది ఇదే సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీలకు ప్రమాదం’ అని వారు పేర్కొన్నారు. 16 నుంచి 20 ఏళ్ల వారిలో చాలావరకు సమస్యలు ప్రారంభ దశలోనే ఉంటున్నాయి. జంక్ ఫుడ్ తీసుకోవడం, మితంగా నీటిని తాగడం వంటివి చేస్తుండడంతో యూరినరీ సమస్యలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. నెఫ్రాలజిస్టుల వద్దకు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్లు, క్రియాటినైన్ పెరగడం, ప్రొటీన్స్ లీకేజీ కావడం వంటి సమస్యలతోనే వస్తున్నారని తెలిపారు. జిమ్‌కు వెళ్లే వారిలో ఎక్కువమందికి ఈ సమస్యలు చూస్తున్నట్లు చెబుతున్నారు. చాలావరకు విద్యాసంస్థల్లో మూత్రశాలలు తక్కువ సంఖ్యలో ఉంటుండడం, దాంతో విద్యార్థులు యూరిన్ వెళ్లడం తగ్గించేందుకు నీళ్లు తాగడం మానేస్తున్నారు. ఇవే యూరిన్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు రావడానికి కారణంగా మారుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.