Punarnava: తెల్లగలిజేరులో ఆరోగ్య ప్రయోజనాలు.. కిడ్నీ వ్యాధులకు..

ఈ మొక్కని 'పునర్నవ' అని కూడా పిలుస్తారు. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉన్నాయి.

Update: 2021-07-22 11:38 GMT

Punarnava: నాలుగు చినుకులు పడగానే మోడు వారిన చెట్లన్నీ చివురులు తొడుగుతాయి. అడవి తల్లి ఒడిలో ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు దర్శనమిస్తుంటాయి. వాటిలో తెల్ల గలిజేరు ఒకటి.

ఈ మొక్కని 'పునర్నవ' అని కూడా పిలుస్తారు. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉన్నాయి. నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు.. ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో ఉంటుంది. అయితే ఔషధ గుణాలు మూడింటిలో ఒకేలా ఉన్నా తెల్లగలిజేరు ఉత్తమమైనదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. వాటికి పూచే పువ్వుల రంగును బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు.

తెల్ల గలిజేరు కఫము, దగ్గు, శరీరంలో కలిగే వాపులు, వాత వ్యాధులు, పొట్టకు సంబంధించిన వ్యాధులకు, లివర్ వాపుకి, గుండె బలహీనత వల్ల వచ్చిన వాపుని పోగొడుతుంది. కిడ్నీల పని తీరును మెరుగు పరుస్తుంది.

కంటి చూపును మెరుగు పరుస్తుంది, రక్తం వృద్ధి చెందుతుంది. తెల్ల గలిజేరు ఆకుని రసం పది గ్రాముల మోతాదు తీసుకుని పెరుగులో కలిపి ఉదయం, సాయింత్రం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. ఇలా మూడు రోజులు తీసుకోవాలి.

ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ఈ ఆకు రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి సన్నని సెగ మీద కాచాలి. రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేదాకా కాచాలి. ఈ నూనెను కీళ్ల నొప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి. నడక రాని పిల్లలకు ఈ తైలం మర్ధన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని ఆయుర్వేద వైద్యులు వివరిస్తారు.

గలిజేరు ఆకు రసాన్ని పటిక బెల్లంతో పాకం పట్టి.. రోజూ ఒక చెంచా చొప్పున నీళ్లలో కలిపి తీసుకుంటే గుండె దడ, బలహీనత తగ్గుతాయి. ఈ ఆకు రసం ఒక స్పూన్ తీసుకుని దానికి కొద్దిగా అల్లం రసం కలిపి నెల రోజులు తాగితే శరీరంలో ఉబ్బు తగ్గుతుంది.

అయితే ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. హుద్రోగ వ్యాధి గ్రస్తులు వైద్యుడి సలహా తీసుకుని తినాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఈ ఆకు కూర తినకూడదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారైనా వారానికి ఒకసారి మాత్రమే తినాలి. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే 'పునర్నవ' అయ్యింది. 

Tags:    

Similar News