మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్?
కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వారందరికీ టీకా వేస్తామని, కొ-విన్ యాప్‌లో నమోదు చేసుకోనవసరంలేదంటోంది కేంద్రం.;
మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలవబోతోంది. అధికారిక ప్రకటన రానప్పటికీ కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి ఏడు రోజుల వ్యవధి సరిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించడంతో..వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను ఈ నెల 13 నాటికి పంపిణీ చేయాలని నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన డ్రైరన్ అనుభవాన్ని, సూచనలను పరిగణలోకి తీసుకుంటూ వ్యాక్సిన్ల పంపిణీకి వ్యూహాలను సిద్ధం చేశారు. టీకా నిల్వకు ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. హర్యానాలోని కర్నల్, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో టీకా నిల్వ ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వారందరికీ టీకా వేస్తామని, కొ-విన్ యాప్‌లో నమోదు చేసుకోనవసరంలేదంటోంది కేంద్రం. ముందుగా ప్రకటించినట్లుగా మూడు కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు.
మొదటి విడతలో వ్యాక్సిన్ తీసుకునే వారికి.. టీకా ఎప్పుడు వేస్తారన్న విషయం ఎలక్ట్రానిక్ విధానంలో కేటాయింపు జరుగుతుందని, ఫోన్‌కు సమాచారం వెళుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. తర్వాతి డోస్ ఎప్పుడు ఇచ్చేదీ కూడా అందులోనే ఉంటుంది. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే.. అందుకు సంబంధించిన సమాచారం కొవిన్ యాప్‌లోనే నమోదవుతుందన్నారు. ఆధార్ కూడా ఉండటంతో టీకా వినియోగంలో అక్రమాలకు తావు ఉండదంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ.