భారత్‌లో వేగంగా కొనసాగుతోన్న కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం
రెండో విడతలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కీలక నేతలకు టీకాలు అందించనున్నారు.;
భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 19 లక్షలా50 వేలా 183 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం 35,785 సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని వివరించింది.. నిన్న ఒక్క రోజు 3 లక్షలా 34 వేలా 679 మందికి... 7,171 సెంటర్లలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. వీరిలో 348 మంది మాత్రం స్వల్ప ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రస్తుతం తొలి విడత వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు అందిస్తున్నారు.. రెండో విడతలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కీలక నేతలకు టీకాలు అందించనున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది. అంతర్జాతీయ రికార్డులు సృష్టిస్తోంది.. మన దేశ ప్రజలకు టీకా పంపిణీ చేయడంతోపాటు నేపాల్, బంగ్లాదేశ్, బ్రెజిల్ సహా అనేక దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడంలో భారత్ ముందు వరుసలో ఉంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కర్ణాటక రికార్డును నమోదు చేసుకుంది. దేశంలో అతి ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందించిన మొదటి రాష్ట్రంగా ఘనత సాధించింది. నిన్నటి వరకు 2 లక్షలా 6వేలా 577 మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు అందించినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఓ వైపు వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నా, కొత్త కేసులు మాత్రం వేలల్లోనే నమోదవుతున్నాయి.. గతంతో పోల్చితే కేసుల సంఖ్య తగ్గుతోంది.. తాజాగా దేశంలో 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 131 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య కోటి 3 లక్షలు దాటింది.. ప్రస్తుతం లక్షా 84వేల యాక్టివ్ కేసులున్నాయి.