Eco Friendly Home: రూ.2 లక్షలతో ఇల్లు కట్టిన రిటైర్డ్ ఇంజనీర్.. మూడు నెలల్లోనే నిర్మాణం
Eco Friendly Home: మూడు నెలల్లోనే ఆయన ఇంటి నిర్మాణం పూర్తయింది.;
Eco Friendly Home: పెద్ద పెద్ద భవంతులు నిర్మించిన ఇంజనీర్‌కి అలాంటి ఇళ్లలో ఉండాలన్న ఆసక్తి లేదు.. చదువుకున్న చదువు నగరాల్లో ఉపాధిని కల్పిస్తే.. జీవితాన్ని మాత్రం ప్రకృతికి దగ్గరగా జీవించాలనుకున్నారు..
మహారాష్ట్రలోని షిలింబ్ గ్రామంలో నరేంద్ర పితలే అనే రిటైర్డ్ ఇంజనీర్ రూ.2 లక్షలతో పర్యావరణానికి అనుకూలమైన ఇంటిని నిర్మించుకున్నారు. పూణె, ముంబైలలో పనిచేసిన ఇంజనీర్.. పదవీ విరమణ అనంతరం షిలింబ్ గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. నరంలోని విలాస జీవితానికి స్వస్థి చెప్పి మట్టి, రీసైకిల్ పదార్ధాలతో ఇల్లు నిర్మించారు. ప్రకృతి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆ ఇంటిని తీర్చిదిద్దిన విధానంలో కనిపిస్తుంది.
ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు.. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇళ్లంటే ఇష్టం.. దాని గురించి తగినంత రీసెర్చ్ చేసి ఈ ఇంటిని నిర్మించాను అంటారు నరేంద్ర. మూడు నెలల్లోనే ఆయన ఇంటి నిర్మాణం పూర్తయింది. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ మరియు వరండాతో కూడిన ఇంటిని కేవలం రూ.2 లక్షలతో నిర్మించుకున్నారు.
ఇంటి నిర్మాణానికి మట్టి మరియు స్థానికంగా లభించే రీసైకిల్ వస్తువులను ఉపయోగించారు. తలుపులు, కిటికీలు, పైకప్పు అన్నీ సెకండ్ హ్యాండ్ వస్తువులు. గోడలను నిర్మించడానికి స్థానిక కర్వీ కలపను ఉపయోగించారు.
ఈ పర్యావరణ అనుకూలమైన ఇంటిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం ఒక సిమెంట్ బస్తాను మాత్రమే ఉపయోగించారు. అది కూడా బాత్రూమ్ కట్టడం కోసం మాత్రమే. మట్టి మోర్టార్ వాడకం వల్ల వేసవిలో కూడా ఇల్లు చల్లగా ఉంటుంది. ఇక రోజువారీ విద్యుత్ వినియోగం కోసం 100-వాట్ల సోలార్ ప్యానెల్‌లను కూడా ఏర్పాటు చేశారు.
పర్యావరణ అనుకూల ఇళ్లను నిర్మించడంలో ప్రజలకు సహాయం చేయాలనేది నరేంద్ర కోరిక. ఇలాంటి ఇళ్ల నిర్మాణం పట్ల చాలా మంది ఆసక్తితో ఉంటారు.. కానీ అదే సమయంలో భద్రత, మన్నిక గురించి భయపడతారు. అయితే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే తన ప్రధాన కర్తవ్యం అంటారు నరేంద్ర