Uttar Pradesh Protests: ఉత్తరప్రదేశ్‌లో ఉద్రిక్తత.. రైతులు vs రాజకీయం

Uttar Pradesh Protests: ఉత్తరప్రదేశ్‌ లిఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనపై ఆందోళనలు చల్లారడం లేదు.

Update: 2021-10-05 16:30 GMT

Uttar Pradesh Protests: ఉత్తరప్రదేశ్‌ లిఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనపై ఆందోళనలు చల్లారడం లేదు. రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న జాతీయ నేతలను సీతాపుర్‌ పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తంగా మారింది.

లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి కుమారుడి కాన్వాయ్‌ రైతులపై దూసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆదివారం రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 9 మంది చనిపోయారు. ఆశిష్‌ మిశ్రాపై స్థానిక పోలీసులు హత్యకేసు నమోదు చేశారు.

కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీపై కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆమెతో పాటు మరో 10 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ప్రియాంకగాంధీ ఉన్న కస్టడీ రూమ్‌పై డ్రోన్‌ తిరుగుతుండడం వివాదాస్పదంగా మారింది. రైతులను పరామర్శించేందుకు లఖీంపూర్‌ ఖేరీకి వెళ్తున్న ప్రియాంకగాంధీని సీతాపూర్ వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.

యూపీ పోలీసుల తీరుపై ప్రియాంక తరపు న్యాయవాది వరుణ్‌ చోపడా మండిపడ్డారు. ప్రియాంకా గాంధీని కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ఎవరెన్ని చేసినా ప్రియాంకగాంధీ మాత్రం భయపడబోరని రాహుల్‌ గాంధీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘేల్‌ను లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులోన పోలీసులు అడ్డుకున్నారు. రేపటిలోగా ప్రియాంకా గాంధీని విడుదల చేయాలని లేకుంటే పంజాబ్ నుంచి లఖింపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని సిద్దూ హెచ్చరించారు. అటు ప్రియాంకను సీతాపూర్‌లోని గెస్ట్‌హౌజ్‌లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

రైతులు, మృతుల కుటుంబాలకు ప్రతిపక్షాల నేతలు, పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. లఖీంపూర్‌ ఖేరీ ఘటన చూసి నిర్ఘాంతపోయానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతులను అత్యంత క్రూరంగా హత్య చేయడం తనను భయపెట్టిందన్నారు. రైతుల హత్యకు కారణమైన వారిని న్యాయపరంగా శిక్షించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓవైపు కేంద్రమంత్రి కుమారుడి కాన్వాయ్‌ రైతులపై దూసుకెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు.. కారులో తన కుమారుడు ఉన్నాడన్న వార్తలను కేంద్రమంత్రి ఖండించారు. మరి.. రేపు ఈ లిఖింపూర్ ఖేరీ ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Tags:    

Similar News