యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో కేసు..!
ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన మహిళా కస్టమర్‌పై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే..;
ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన మహిళా కస్టమర్‌పై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే... జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడని బెంగుళూరుకి చెందిన హితేషా చంద్రాణి అనే యువతి జొమాటో డెలివరీ బాయ్ పైన పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.
డెలివరీ బాయ్ అయిన కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద విడుదలైయ్యాడు కామరాజ్.. అయితే ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది. ఏ పోలీస్ స్టేషన్‌లో అయితే సదరు యువతి కేసు పెట్టిందో.. అదే పోలీస్ స్టేషన్‌లో ఆ యువతి పైన కేసు పెట్టాడు కామరాజ్.
ఈ సందర్భంగా కామరాజ్ మాట్లాడుతూ.. సదరు యువతి పైన ఎలాంటి దాడి చేయలేదని, డెలివరీ ఆలస్యం అయినందుకు తానూ క్షమాపణలు కూడా చెప్పినట్టుగా వెల్లడించాడు. అంతేకాకుండా ఆర్డర్ క్యాన్సిల్ అయినందున ఫుడ్ తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరినట్టుగా తెలిపాడు. దానికి గాను ఆ యువతి తనని అసభ్య పదజాలంతో దూషించి, తనపైకి షూ విసిరిందని అన్నాడు.
ఈ క్రమంలో అనుకోకుండా తనను తానే గాయపర్చుకుందని, చివరకు తాను ఆమెపై దాడి చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపాడు. తనను అవమానించినందుకు గాను యువతిపై కేసు పెట్టినట్టుగా కామరాజ్ తెలిపాడు. కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువతి పైన ఐపీసీ 341, 355, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు