China Corona: చైనాలో మరోసారి కరోనా విజృంభణ.. లక్షణాలు లేకపోయినా..
China Corona: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నా చైనాలో మాత్రం విజృంభిస్తోంది.;
China Corona: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నా చైనాలో మాత్రం విజృంభిస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో చాలా నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘై కూడా లాక్‌డౌన్‌లోకి జారుకుంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు నగరంలో ఉన్న 2కోట్ల 60 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
ఇప్పటికీ మూడు వేవ్‌లను సమర్థవంతంగా ఎదుర్కున్న చైనా... ఇప్పుడు నానా తంటాలు పడుతోంది. చైనాలో ఇంతపెద్ద నగరంలో కొవిడ్ ఆంక్షలు అమలు చేయడం ఇదే తొలిసారి. షాంఘై నగరంలో ఆదివారం ఒక్కరోజే 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం ఇక్కడే రికార్డవుతున్నాయి. వీటిలో అత్యధికం లక్షణాలు లేనివే.
3వేలకు పైగా జనానికి కరోనా సోకితే.. కేవలం 50 మందిలోనే లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో దాదాపు రెండున్నర కోట్లకుపైగా జనాభా కలిగిన షాంఘై నగరంలో సోమవారం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. చైనాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
ముఖ్యంగా జిలిన్ ప్రావిన్సులో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు 56వేల కేసులు వచ్చాయి. తాజాగా షాంఘైలో నిత్యం 3వేలకు పైగా కేసులు రావడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ నుంచి పొంచివున్న ముప్పును తగ్గించేందుకే నగరం మొత్తం కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.