Jobs : నిరుద్యోగులకు పండగే..దేశంలో 10 కోట్ల ఉద్యోగాల జాతర.

Update: 2026-01-06 06:45 GMT

Jobs : దేశంలో నిరుద్యోగ సమస్యకు చరమగీతం పాడేందుకు పారిశ్రామిక దిగ్గజాలు నడుం బిగించాయి. రాబోయే పదేళ్లలో ఏకంగా 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా హండ్రెడ్ మిలియన్ జాబ్స్ అనే భారీ జాతీయ కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. దేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నా, దానికి తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం నాస్కామ్ సహ వ్యవస్థాపకుడు హరీష్ మెహతా, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ నెట్‌వర్క్ టిఐఇ వ్యవస్థాపకుడు ఏజే పటేల్, సీఐపీపీ వ్యవస్థాపకుడు యతీష్ రాజావత్ కలిసి ఈ భారీ మిషన్‌ను ప్రకటించారు. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 1.2 కోట్ల మంది కొత్తగా పని చేసే వయసులోకి వస్తున్నారు. వీరిని ఆదుకోవాలంటే ఏటా కనీసం 80 నుంచి 90 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమని వీరు లెక్కగట్టారు. ప్రస్తుతం ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇంతమందికి ఉపాధి కల్పించడంలో ఇబ్బందులు పడుతున్నందున, కొత్త మార్గాల ద్వారా ఉద్యోగ వేట సాగించనున్నారు.

ఏఐ సవాలును అవకాశంగా మార్చుకుంటూ.. ప్రస్తుతం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గిపోతాయన్న భయం అందరిలో ఉంది. అయితే ఈ కొత్త మిషన్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, శ్రమతో కూడిన పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఆ సవాలును అధిగమించాలనుకుంటున్నారు. కేవలం పెద్ద కంపెనీలే కాకుండా, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయడం ద్వారానే ఈ 10 కోట్ల ఉద్యోగాల లక్ష్యం సాధ్యమవుతుందని హరీష్ మెహతా అభిప్రాయపడ్డారు.

భారత జీడీపీలో 30 శాతం వాటా కలిగి ఉన్న స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలే అత్యధిక మందికి ఉపాధిని ఇస్తున్నాయి. అయితే ఇవి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరించాలని ఏజే పటేల్ పేర్కొన్నారు. వ్యవస్థాపకతను సామాన్య ప్రజలకు చేరువ చేయడం ద్వారా స్వయం ఉపాధితో పాటు ఇతరులకు కూడా పని కల్పించేలా ప్రోత్సహిస్తారు. రాబోయే తరానికి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించడమే ఈ హండ్రెడ్ మిలియన్ జాబ్స్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం.

Tags:    

Similar News