Mega DSC : ఏపీ మెగా డీఎస్సీ లో అరుదైన ఘటన.. టీచర్ గా ఎంపికైన బీఎస్ఎఫ్ జవాన్ రోజా...
దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూనే ఒక బీఎస్ఎఫ్ జవాను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికై అద్భుత విజయాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఈ అరుదైన ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెకు చెందిన రోజా డీఎస్సీలో 83.16 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. కాగా ఆమె ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కు చెందిన రోజాకు చిన్నప్పటి నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనే కల ఉంది. 2018లో తన సోదరితో కలిసి డీఎస్సీ పరీక్ష రాసినప్పటికీ, ఆమె సెలెక్ట్ కాలేదు. ఆమె సోదరి మాత్రం టీచర్‌గా ఎంపికయ్యారు.కాగా 2022లో ఎస్ఎస్సీ జీడీ పరీక్ష రాసి బీఎస్ఎఫ్ జవానుగా ఎంపికయ్యారు రోజా. ప్రస్తుతం పంజాబ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ టీచర్ కావాలనే తన ఆశయాన్ని విడిచిపెట్టలేదు రోజా. దేశ రక్షణలో బిజీగా ఉంటూనే, ఖాళీ సమయంలో మెగా డీఎస్సీకి సిద్ధమయ్యారు. సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొంటూనే, తన లక్ష్యం వైపు అడుగులు వేసిన రోజా..ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ ఫలితాల్లో అనుకున్నది సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కాగా ఆమె విజయం నేటి యువతకు స్పూర్తిగా నిలుస్తోందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.