EPFO : పీఎఫ్ ఖాతాదారులకు డేంజర్ బెల్స్.. ఆ ఒక్క పొరపాటు చేస్తే మీ పెన్షన్ గోవిందా.
EPFO : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అనేది ఒక భరోసా. రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర సమయంలో చేతికి అందే ఈ డబ్బు విషయంలో చిన్న పొరపాటు జరిగినా అది కొంపముంచుతుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ తాజాగా తన సభ్యులను ఒక విషయంలో గట్టిగా హెచ్చరిస్తోంది. మీ పీఎఫ్ ఖాతాలో కేవలం డబ్బులు పడుతున్నాయా లేదా అని చూడటమే కాదు, అందులో ఉన్న కొన్ని తేదీలను కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెబుతోంది. మీరు ఒక కంపెనీలో ఎప్పుడు చేరారు, ఎప్పుడు మానేశారు అనేవి పీఎఫ్ ఖాతాలో చాలా కీలకం. వీటి ఆధారంగానే మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారనేది లెక్కతేలుతుంది. మీ పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలన్నా లేదా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రావాలన్నా ఈ రెండు తేదీలు సరిగ్గా ఉండాలి. ఒకవేళ వీటిలో తప్పులు ఉంటే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీరు పొందే పెన్షన్ మొత్తం కూడా తగ్గిపోవచ్చు.
చాలామంది పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకుంటారు కానీ సర్వీస్ హిస్టరీని పట్టించుకోరు. మీ సర్వీస్ పీరియడ్ ని బట్టి సిస్టమ్ ఆటోమేటిక్ గా వడ్డీని, పెన్షన్ అర్హతను లెక్కిస్తుంది. రికార్డులో తప్పుడు సమాచారం ఉంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు సరైన వడ్డీ రాదు. అలాగే పదేళ్ల సర్వీస్ నిండితేనే పెన్షన్ కు అర్హత ఉంటుంది, కాబట్టి జాయినింగ్, ఎగ్జిట్ డేట్లు కరెక్ట్ గా లేకపోతే పెన్షన్ కు గండం పొంచి ఉన్నట్టే.
గతంలో పీఎఫ్ వివరాలు మార్చుకోవాలంటే కంపెనీల చుట్టూ, పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఆ ప్రక్రియను ఆన్‌లైన్ లోనే పూర్తి చేసే వెసులుబాటు కల్పించింది. మీ UAN నంబర్ ఆధార్ తో లింక్ అయి ఉంటే.. మీరు స్వయంగా లాగిన్ అయి పేరు, పుట్టిన తేదీ, జెండర్ తో పాటు జాయినింగ్, ఎగ్జిట్ డేట్లను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. చాలా వరకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండానే మీరు పంపిన రిక్వెస్ట్ ను ఈపీఎఫ్ఓ అధికారులు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు.
ఒకవేళ మీరు గతంలో పనిచేసిన కంపెనీ మూతపడినా లేదా యాజమాన్యం సహకరించకపోయినా భయపడాల్సిన పనిలేదు. జాయింట్ డిక్లరేషన్ ఫారం నింపి, ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ లేదా బ్యాంకు మేనేజర్ తో సంతకం చేయించి పీఎఫ్ కార్యాలయంలో సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా కూడా మీ వివరాలను సరిచేసుకోవచ్చు. ఏది ఏమైనా, పొరపాట్లు జరిగిన తర్వాత బాధపడేకంటే, ముందే మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ఉత్తమం.