TCS : ప్రతి గంటకు 9 మంది ఉద్యోగులు అవుట్.. కొత్త వివాదంలో ఐటీ దిగ్గజం టీసీఎస్.
TCS : భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికం (జూన్-సెప్టెంబర్) ఫలితాల తర్వాత ఉద్యోగుల సంఖ్యపై పెద్ద వివాదం మొదలైంది. కంపెనీ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం.. జూన్ త్రైమాసికంలో ఉన్న 6,13,069 మంది ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్ త్రైమాసికంలో 5,93,314కి తగ్గింది. అంటే కేవలం మూడు నెలల్లోనే కంపెనీ 19,755 మంది ఉద్యోగులను తగ్గించింది. ఈ లెక్క ప్రకారం చూస్తే.. ప్రతి గంటకు దాదాపు 9 మంది ఉద్యోగులను టీసీఎస్ తమ వర్క్‌ఫోర్స్ నుంచి తొలగించినట్లు అవుతుంది. దీనితో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మళ్లీ 6 లక్షల దిగువకు పడిపోయింది.
ఉద్యోగుల సంఖ్యలో ఇంత భారీ కోతపై NITES అనే ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీ తరపున హ్యుమన్ రీసోర్స్ అధికారి సుదీప్ కున్నుమల్ మాట్లాడుతూ.. తాము కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఒక శాతం అంటే సుమారు 6,000 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించామని తెలిపారు. అయితే, NITES ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకించింది. కంపెనీ కావాలనే తొలగింపుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందని, అసలు లెక్కలు (దాదాపు 20 వేల మంది) నిజాయితీని బయటపెడుతున్నాయని యూనియన్ గట్టిగా ఆరోపించింది.
ఉద్యోగుల సంఘం NITES టీసీఎస్ పై మరింత తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజీనామాలు చేయమని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాన్ని కంపెనీ అనుసరించిందని, ఈ భారీ కోతలు స్వచ్ఛందంగా జరిగినవి కాదని, యాజమాన్యం తీసుకున్న చర్యల ఫలితమేనని పేర్కొంది. కంపెనీ అదే సమయంలో ఆదాయాన్ని పెంచుకుంటూ పోయిందని, కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి వ్యాపార కారణాలు చూపించడం సరికాదని యూనియన్ వాదించింది. 10 నుంచి 15 ఏళ్లు కంపెనీకి సర్వీసు చేసిన ఉద్యోగులను రాత్రికి రాత్రే తొలగించడం క్రూరత్వం అని, టీసీఎస్ మనుషుల కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని NITES అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఆగ్రహం వ్యక్తం చేశారు.