తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అత్యంత కీలకమైన వార్షిక పరీక్షల సమయం వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు నెలల తరబడి సన్నద్ధమవుతుండగా, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ అంతటా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 5,17,727 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:35 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిదని తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.