New Tax Law : 64 ఏళ్ల పాత పన్ను చట్టానికి సెలవు..ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.

Update: 2026-02-13 06:46 GMT

New Tax Law : భారతదేశ పన్నుల చరిత్రలో ఒక భారీ మార్పుకు రంగం సిద్ధమైంది. దాదాపు 64 ఏళ్లుగా అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇక కనుమరుగు కానుంది. దాని స్థానంలో అత్యంత సరళమైన, ఆధునికమైన కొత్త ఆదాయపు పన్ను చట్టం రాబోతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం మీ జేబుపై, మీ పొదుపు అలవాట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సంక్లిష్టమైన పాత పదాలను తొలగించి, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు.

ట్యాక్స్ క్యాలెండర్‌లో భారీ మార్పు

ఇప్పటివరకు ఆదాయపు పన్ను లెక్కల్లో ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే పదాలు సామాన్యులను గందరగోళానికి గురిచేసేవి. కొత్త చట్టం ఈ తలనొప్పిని వదిలించింది. ఇకపై కేవలం ట్యాక్స్ ఇయర్ అనే ఒకే ఒక్క విధానం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య మీరు సంపాదించిన దానికి, అదే ఏడాది లెక్కలు సరిచూసుకోవచ్చు. దీనివల్ల పన్ను గణన ప్రక్రియ చాలా సరళంగా మారుతుంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతకు తమ ట్యాక్స్ రిటర్న్స్ తామే ఫైల్ చేసుకునే అవకాశం కలుగుతుంది.

సోషల్ మీడియాపై నిఘా.. నిజమేనా?

మీరు విదేశీ ప్రయాణాలు చేసినా లేదా ఖరీదైన వస్తువులు కొని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లో ఫోటోలు పెట్టినా ట్యాక్స్ ఆఫీసర్లు మీ పట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కొత్త చట్టం ప్రకారం అధికారులకు డిజిటల్ ఆధారాలు సేకరించే అధికారం ఇచ్చారు, కానీ అది అందరికీ వర్తించదు. కేవలం కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడే సీరియస్ ట్యాక్స్ ఇవేడర్స్ పై మాత్రమే ఈ నిఘా ఉంటుంది. సాధారణ పౌరుల వాట్సాప్ చాట్లు గానీ, పర్సనల్ మెసేజ్‌లు గానీ చూసే అధికారం అధికారులకు ఉండదు. కచ్చితమైన సమాచారం, సెర్చ్ వారెంట్ ఉంటేనే ఇలాంటి చర్యలు చేపడతారు. కాబట్టి నిజాయితీగా పన్ను కట్టే వారు భయపడాల్సిన అవసరం లేదు.

లేట్ ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ గ్యారెంటీ

మధ్యతరగతి ఉద్యోగులకు ఇది అతిపెద్ద ఊరటనిచ్చే అంశం. పాత నిబంధనల ప్రకారం జూలై 31 డెడ్‌లైన్ దాటితే, ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసినా మీ టీడీఎస్ రీఫండ్ రాకపోయేది. మీ సొంత సొమ్ము ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లిపోయేది. కానీ కొత్త చట్టం దీనిని మార్చేసింది. ఇకపై మీరు నిర్ణీత గడువు దాటిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసినా, మీ రిఫండ్ మీకు అందుతుంది. అయితే క్రమశిక్షణ కోసం ప్రభుత్వం చిన్న జరిమానా విధించింది. ఏడాది ఆదాయం 5 లక్షల లోపు ఉంటే రూ.1,000, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.5,000 జరిమానా కట్టి మీ భారీ రీఫండ్ మొత్తాన్ని వెనక్కి పొందవచ్చు.

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు చేదు వార్త

సొవొరెన్ గోల్డ్ బాండ్స్‎లో ఇన్వెస్ట్ చేసే వారికి కొత్త చట్టం షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ (సెకండరీ మార్కెట్) ద్వారా గోల్డ్ బాండ్స్ కొని లాభానికి అమ్మితే పన్ను ఉండేది కాదు. కానీ కొత్త నిబంధనల ప్రకారం సెకండరీ మార్కెట్ లాభాలపై 12.5% పన్ను వసూలు చేస్తారు. అయితే మెచ్యూరిటీ వరకు బాండ్లను ఉంచుకునే వారికి మాత్రం పాత రాయితీలు కొనసాగే అవకాశం ఉంది. కేవలం ట్రేడింగ్ చేసే ఉద్దేశంతో గోల్డ్ బాండ్స్ కొనేవారు ఇకపై కొంత పన్ను సొమ్మును పక్కన పెట్టుకోవాల్సిందే.

పారదర్శకతకు పెద్దపీట

కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 లక్ష్యం ఒక్కటే.. పన్ను చెల్లింపుదారుల జీవితాన్ని సులభతరం చేయడం. సంక్లిష్టమైన చట్టాలను రద్దు చేసి, డిజిటల్ యుగానికి తగ్గట్టుగా నిబంధనలను మార్చడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య నమ్మకం పెరుగుతుంది. పన్ను ఎగవేతదారులకు పక్కాగా చెక్ పెడుతూనే, నిజాయితీపరులకు తగిన గౌరవం, సౌకర్యం కల్పించేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది.

Tags:    

Similar News