Indian Railways : భారతీయ రైల్వేలో 4 కొత్త సూపర్ ఫాస్ట్ కారిడార్లు.. ఇక రైళ్లు లేట్ కావు.
Indian Railways : దేశంలో రైలు ప్రయాణం చేసే కోట్లాది మందికి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అందించింది. రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి, తరచుగా జరిగే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.24,634 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ భారీ కేటాయింపుతో 894 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నాలుగు లేదా ఆరు లేన్లుగా మార్చి అభివృద్ధి చేయనున్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేబినెట్ తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయం వివరాలను తెలిపారు. ఈ నాలుగు ప్రాజెక్టులు దేశంలోని ముఖ్యమైన నాలుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ల మీదుగా వెళ్తాయి. ఈ మహా ప్రాజెక్ట్ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని 18 జిల్లాలకు నేరుగా ప్రయోజనం లభించనుంది. కొత్త లైన్లు వేయడం ద్వారా ప్రయాణమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త వేగం లభిస్తుందని మంత్రి తెలిపారు.
కీలకమైన నాలుగు కారిడార్లు ఇవే రైల్వే ట్రాఫిక్‌ను తగ్గించడానికి అభివృద్ధి చేయనున్న నాలుగు ముఖ్యమైన రూట్‌ల వివరాలు:
వర్ధా-భుసావల్ సెక్షన్: మహారాష్ట్రలో ఉన్న ఈ 314 కి.మీ రూట్, ముంబై-హౌరా కారిడార్‌లో ముఖ్యమైన భాగం. ఇక్కడ మూడవ, నాల్గవ లైన్ల నిర్మాణం వల్ల రైళ్ల రాకపోకలు చాలా వేగంగా జరుగుతాయి.
గోండియా-డోంగర్‌గఢ్ సెక్షన్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లను కలిపే ఈ 84 కి.మీ మార్గం, ముంబై-హల్దియా లైన్‌లో ఉంది. ఇక్కడ నాల్గవ లైన్ నిర్మాణం వల్ల సరుకు రవాణా రైళ్లకు, ప్రయాణీకుల రైళ్లకు వేర్వేరు ట్రాక్‌లు లభిస్తాయి.
వడోదర-రత్లాం సెక్షన్: గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఈ 259 కి.మీ మార్గం, ఢిల్లీ-ముంబై కారిడార్‌కు వెన్నెముక వంటిది. ఈ మార్గాన్ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఢిల్లీకి ప్రయాణం మరింత వేగంగా మారుతుంది.
ఇటార్సీ-భోపాల్-బీనా సెక్షన్: మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ 237 కి.మీ రూట్‌లో నాల్గవ లైన్ నిర్మిస్తారు. ఇది ఢిల్లీ-చెన్నై మార్గంలో ముఖ్యమైన జంక్షన్. ఈ మార్గం నుంచి వెళ్లే వందలాది రైళ్లకు ప్రయోజనం కలుగుతుంది.
ప్రాజెక్టులు ఎందుకు ముఖ్యమైనవి?
ఈ నాలుగు రూట్‌లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఇవి దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఏడు ముఖ్యమైన రైల్వే మార్గాల్లో భాగం. దేశంలో ఉన్న సరుకు రవాణాలో 41 శాతం, ప్రయాణీకుల ట్రాఫిక్‌లో 41 శాతం ఈ మార్గాల గుండానే వెళ్తుంది. కెపాసిటీ కంటే ఎక్కువ రైళ్లు నడపడం వల్లే తరచుగా రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. ఈ లైన్లను విస్తరించడం ద్వారా, ప్యాసింజర్ రైళ్లను సమయానికి నడపడంతో పాటు, సరుకు రవాణా రైళ్లకు ప్రత్యేక కారిడార్ ఏర్పడుతుంది. దీనివల్ల పరిశ్రమలకు ముడిసరుకు చేరడం, తయారైన వస్తువులు పోర్టులకు పంపడం చాలా వేగంగా జరుగుతుంది.
2031 నాటికి కొత్త జీవితం ఈ ప్రాజెక్టుల పూర్తితో భారతీయ రైల్వేకు కొత్త శకం మొదలవుతుంది. ట్రాక్‌లపై రద్దీ తగ్గినప్పుడు, రైళ్లు తమ గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గి, గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు. ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్న సరుకు రవాణా రైళ్ల వేగం కూడా పెరుగుతుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నింటినీ 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.