New Labor Codes : స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్..గిగ్ వర్కర్లకు కూడా పీఎఫ్, ఈఎస్‌ఐ.
New Labor Codes : భారతదేశంలో కార్మిక రంగంలో అతిపెద్ద సంస్కరణలు అమలులోకి వచ్చాయి. కార్మికుల భద్రత, హక్కులు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేస్తోంది. ఈ చారిత్రక నిర్ణయంలో భాగంగా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో ఈ కొత్త కోడ్‌లను రూపొందించారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలకు అనుగుణంగా భారత కార్మిక వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం అని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త కోడ్‌లు ఉద్యోగ కల్పనను పెంచడానికి, దేశీయ పరిశ్రమలకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
కొత్తగా వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, ఉద్యోగులకు రక్షణ, పరిశ్రమలకు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ నాలుగు కొత్త కార్మిక సంహితలను రూపొందించారు. అవి 1. వేతన సంహిత, 2019
2. ఇండస్ట్రీయల్ రిలేషన్స్ కోడ్ , 2020 (Industrial Relations Code, 2020)
3. కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ, 2020
4. ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండీషన్స్ కోడ్, 2020
కార్మికులకు కీలక ప్రయోజనాలు
కొత్తగా వచ్చిన ఈ కార్మిక సంహితల ద్వారా కార్మికులకు లభించే ముఖ్య ప్రయోజనాలు. ఉద్యోగులందరికీ నియామక పత్రం ఇవ్వడం తప్పనిసరి. దీనివల్ల ఉద్యోగం చట్టಬద్ధమవుతుంది. అసంఘటిత రంగంలో పనిచేసే గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు (ఉదా: స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్స్) కూడా పీఎఫ్, ఈఎస్‌ఐ , ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలతో కూడిన యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ వర్తిస్తుంది. దేశంలోని కార్మికులందరికీ నిర్ణీతమైన కనీస వేతనం పొందే హక్కు లభిస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ఉద్యోగులందరికీ కంపెనీలు ఏటా ఉచిత ఆరోగ్య తనిఖీ సౌకర్యాన్ని కల్పించాలి. వేతనాన్ని నిర్ణీత సమయానికి చెల్లించడం తప్పనిసరి.
మైనింగ్‌తో సహా అన్ని రంగాలలో మహిళలు నైట్ షిఫ్ట్‌లో పనిచేయడానికి అనుమతించడం, పురుషులతో సమానంగా సమ వేతనం, ఇతర సదుపాయాలు కల్పించడం తప్పనిసరి. కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేసే ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే విధంగా గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు లభిస్తాయి.
గిగ్ వర్కర్లకు ప్రత్యేక నిధులు
కొత్త చట్టాల ప్రకారం.. ప్లాట్‌ఫామ్ (Swiggy, Zomato వంటి అగ్రిగేటర్) సంస్థలు తమ డెలివరీ లేదా రైడింగ్ పార్ట్‌నర్ల కోసం సంక్షేమ నిధులను ఏర్పాటు చేయాలి. ఈ అగ్రిగేటర్ సంస్థలు తమ మొత్తం వ్యాపార టర్నోవర్‌లో 1% నుంచి 2% వరకు మొత్తాన్ని ఈ కార్మిక సంక్షేమ నిధికి జమ చేయడం తప్పనిసరి. ఈ నిర్ణయం గిగ్ వర్కర్ల ఉద్యోగానికి చట్టపరమైన గుర్తింపు, సామాజిక భద్రతను అందిస్తుంది.