ఐటీ పరిశ్రమలో గత రెండేళ్ల నుంచి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడం, సంస్థల పునర్నిర్మాణంలో భాగంగా తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు టెక్ కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటివి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
2023లో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు ఇప్పట్లో ముగిసేలా సంకేతాలు కనిపించడం లేదు. 2024 జనవరి నుంచి జులై ఆఖరి వరకు ఐటీ పరిశ్రమలోని ప్రముఖ కంపె నీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. తొలగిస్తూనే ఉన్నాయి. చాలా కంపెనీలు సైలెంట్ ఆఫ్ ద్వారా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ ఏడాది జులై చివరి నాటికి దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క జులై మాసంలోనే 34 టెక్ కంపెనీలు దాదాపు 8000 మందిని తొలగించాయి. ఇంటిల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపె నీలు కూడా ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియను కొనసాగించాయి.
2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 384 కంపెనీల నుండి 124,517 మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇంటెల్ ఇటీవల 15 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 10 బిలియన్ డాలర్లను ఆదా చేసే ప్రణాళికలో భాగంగా కంపెనీ తన ఉద్యోగులను 15 శాతం తగ్గించుకోనుంది. మరోవైపు, మైక్రోసాఫ్ట్ కూడా గత రెండు నెలల్లో సుమారు 1000 మందిని తొలగించింది.