SSMB 29 Shooting : కెన్యాలో SSMB29 షూటింగ్ పూర్తి.. విదేశాంగ మంత్రి ప్రశంసలు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం SSMB 29 షూటింగ్ కెన్యాలో పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియా ముదావడి వెల్లడించారు. తమ దేశంలో విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం భారత్‌కు తిరిగి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా దీనికి సంబంధించిన వివరాలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కెన్యా మంత్రి ముసాలియా ముదావడి. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచంలోని గొప్ప దర్శకులలో ఒకరైన రాజమౌళి, ఆయన బృందం గత రెండు వారాలుగా కెన్యాలో చిత్రీకరణ జరిపారని... ఆసియాలో అతిపెద్ద నిర్మాణ సంస్థ తమ దేశంలో షూటింగ్ చేయడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సినిమాలోని ఆఫ్రికా సన్నివేశాల్లో దాదాపు 95 శాతం కెన్యాలోనే చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా తమ దేశ అందాలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశం దొరికిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మకంగాతెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి మార్క్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.