స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మరో వారం రోజుల్లో ముగియనుంది. డిగ్రీ పూర్తైన వారు జులై 24 వరకు అప్లై చేయవచ్చు. పోస్టులను బట్టి 18-30, 20-30, 18-27 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఫీజు రూ.100. మహిళలు, SC, ST, PWd వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. టైర్-1 పరీక్షలు సెప్టెంబర్/అక్టోబర్, టైర్-2 డిసెంబర్‌లో జరుగుతాయి. SSC CGL టైర్ 1 పరీక్ష తేదీలను కమిషన్ ఎప్పుడైనా ప్రకటిస్తుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో ఉండనుంది. గతేడాది గ్రూప్ బి, సి పోస్టుల కోసం 8,415 ఖాళీలను కమిషన్ నోటిఫై చేయగా, అంతకు ముందు ఏడాది 37,409 ఖాళీలను ప్రకటించింది.
అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ, CA/CS/MBA/కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/ కామర్స్‌లో మాస్టర్స్/ బిజినెస్ స్టడీస్‌లో మాస్టర్స్ కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్ట్ కోసం గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ (12వ తరగతిలో గణితంలో కనీసం 60 శాతం) ఉండాలి.