EPS-95 Pension : ఈపీఎస్ పెన్షన్ పెంపు ఎందుకు ఆలస్యం ? రూ.7,500 ఎప్పటి నుంచి వస్తాయి?
EPS-95 Pension : దేశంలోని లక్షలాది మంది EPS-95 పెన్షన్దారులు గత కొన్ని సంవత్సరాలుగా తమ కనీస పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీవనం సాగించడం కష్టంగా మారడంతో, పెన్షన్‌ను పెంచడంతో పాటు, కరువు భత్యం, ఫ్యామిలీ పెన్షన్, ఉచిత వైద్య సదుపాయాలు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఈ సమస్యను ఇటీవల పార్లమెంట్‌లో లేవనెత్తారు. కనీస పెన్షన్ పెంపులో ఆలస్యం ఎందుకు జరుగుతోంది, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ఇంత సమయం ఎందుకు పడుతోంది అని ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం EPS-95 అనేది నిధి (ఫండ్) ఆధారిత సామాజిక భద్రతా పథకం. ఇందులో ఉద్యోగి జీతంలో 8.33% యజమాని జమ చేస్తారు, అలాగే ప్రభుత్వం గరిష్టంగా రూ.15,000 జీతంపై 1.16% వాటాను అందిస్తుంది. పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఈ ఫండ్ నుంచే చెల్లిస్తారు.
ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1,000 గా ఉంది, దీనిని 2014 లో నిర్ణయించారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను కరువు భత్యం లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌కు అనుసంధానించలేదు. పెన్షన్ పెంపు ఆలస్యానికి ప్రధాన కారణం EPS ఫండ్‌లో తీవ్రమైన ఆర్థిక లోటు ఉండటమేనని ప్రభుత్వం తెలిపింది. 2019 మార్చి 31 నాటికి ఉన్న గణాంకాల ప్రకారం, ఫండ్‌లో ఉన్న డబ్బుతో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ పెంపు లేదా డీఏ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.1,000 కనీస పెన్షన్‌ను నిర్ధారించడానికి అదనపు బడ్జెట్ సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
EPS పెన్షన్‌ను కరువు భత్యంతో అనుసంధానించే అంశాన్ని ఒక ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది. ఫండ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన కమిటీ, పెన్షన్‌ను డీఏతో ముడిపెట్టడం లేదా పెంచడం ఆచరణాత్మకం కాదని నివేదించింది. అందుకే, ఈ డిమాండ్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.
ఇక ఎక్కువ జీతంపై పెన్షన్ నిర్ణయించడానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఆదేశాల అమలు ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యాన్ని కల్పించారు, దీనికి లక్షలాది మంది పెన్షన్దారులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దరఖాస్తులను పరిశీలించడం, యజమానుల నుంచి ధృవీకరణ పొందే ప్రక్రియ జరుగుతోందని మంత్రిత్వ శాఖ వివరించింది.
ప్రభుత్వం తమ ఆర్థిక సమస్యలు, పురోగతిని వివరించినప్పటికీ, EPS కనీస పెన్షన్‌ను రూ.7,500 కు పెంచడం, డీఏ ఇవ్వడం లేదా ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడంపై మాత్రం ఎలాంటి స్పష్టమైన గడువును ప్రకటించలేదు. దీంతో EPS-95 పెన్షన్దారుల నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది. వారి ఆశలు ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉన్నాయి.