మోచాతో తెలుగు రాష్ట్రాలకు మరింత ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 9 జిల్లాల్లో, వడగళ్ల వర్షాలు పడతాయని హెచ్చరించింది. మోచా తుఫాను విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. దాని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టంచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని.. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏపీలోనూ ఈ రోజు రేపు భారీ వర్ష సూచనను సూచించింది.
ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావంతో ఈనెల 8న ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశముందని, ఇది మరుసటి రోజున వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ వాయుగుండం ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తీవ్రమై తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు స్పష్టంచేశారు. రైతులు, చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అటు తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో తమిళనాడులోని 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఉరుములు మెరుపులతో కూడి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. అటు మోచా ప్రభావం ఒరిస్సా, తమిళనాడు ఆంధ్ర, తెలంగాణపై మరింత ప్రభావం చూపుతుందన్నారు.