ALLU ARJUN: సీఎం మాటలు బాధించాయి
తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారన్న అల్లు అర్జున్... తాను ఒక తండ్రినే అని ఆవేదన;
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి ఘటన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై హీరో అల్లు అర్జున్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరీ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరడాన్ని భరించలేకపోతున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులను పరామర్శించేందుకు ఎంతో దూరం వెళ్లానని.. అలాంటిది తన అభిమానులు గాయపడితే తాను ఎంత బాధపడతా? అని అన్నారు. తొక్కిసలాట ఘటన మరుసటి రోజు వరకు తనకు తెలీదన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలనుకున్నానని చెప్పారు. కానీ, అక్కడికి రావొద్దని పోలీసులు సూచించారని అల్లు అర్జున్ చెప్పారు. శ్రీతేజ్ ఆస్పత్రిలో ఉన్నాడని తెలిసి తన మనుషులను అక్కడికి పంపించానన్నారు. ఈ బాధలో తాను సక్సెస్ మీట్‌ను కూడా రద్దు చేసుకున్నామని అల్లు అర్జున్ చెప్పారు. సీఎం వ్యాఖ్యలు బాధించాయన్నారు.
నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్
తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. 'సంధ్య థియేటర్ ఘటన ఒక యాక్సిడెంట్. థియేటర్‌లో నేను ఏదేదో అన్నానని అంటున్నారు. నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. నేను రోడ్ షో చేయలేదు. పోలీసులు క్లియర్ చేస్తేనే ముందుకు వెళ్లాను.' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
నేను కూడా తండ్రినే: అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన అల్లు అర్జున్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూడటానికి వచ్చి శ్రీతేజ్ కు అలా జరగడం చాలా బాధగా ఉందన్నారు. తాను కూడా తండ్రినేనని.. ఓ తండ్రి బాధను అర్థం చేసుకోగలనని అల్లు అర్జున్ అన్నారు. ఈ దుర్ఘటనపై తాను ఎవ్వరినీ బ్లేమ్ చేయదలుచుకోలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బన్నీ భావోద్వేగం
సంధ్య థియేటర్ ఘటనలో వివరణ ఇస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఆలయం లాంటి థియేటర్ లో ఇలాంటి ఘటన జరగడం తన మనసును కలచివేసిందని బన్నీ అన్నారు. ఈ క్రమంలో ఆయన కంటతడి పెట్టారు. అనంతరం భావోద్వేగాలను అదుపు చేసుకుని మాట్లాడారు.