Miss World: తారలు దిగి వచ్చిన వేళ..

మిస్‌ వరల్డ్‌-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం;

Update: 2025-05-11 03:30 GMT

దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే... అందులోనూ మన భాగ్య నగరానికి వస్తే... గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం కలగలసిన 110 దేశాలకు చెందిన సుందరీమణులు హొయలుపోతూ సంప్రదాయ వస్త్రధారణతో ర్యాంప్‌పై మెరిశారు. దేవకన్యలను తలపించారు. వారి అందం ముందు.. విద్యుత్తు కాంతులే వెలవెలబోయాయి. ఈ ర్యాంప్‌ వాక్ ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్‌ వరల్డ్‌ 72వ ఎడిషన్‌ పోటీలు హైదరాబాద్‌ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. అందగత్తెలు తమను తాము పరిచయం చేసుకోగా.. సుందరీమణులను తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నృత్యాలు చేస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆరంభ వేడుకలకు హాజరయ్యారు.

హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్‌ పోటీలు 2025 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 110కిపైగా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ ప్రపంచ సుందరీ కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత దేశం తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, డీజీపీ జితేందర్, హైదరాబాద్​ మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గచ్చిబౌలిలో మిస్‌వరల్డ్‌-2025 పోటీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్‌ ప్రకటించగానే.. పోటీదారులంతా ఒకే వేదికపై నిలబడగా.. మిస్‌ వరల్డ్‌ గీతాలాపన చేశారు. దేశ విదేశాల్లో కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. దాదాపు వెయ్యి మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఆన్‌లైన్‌తోపాటు నేరుగా కవర్‌ చేశారు.

భారత్‌ మాతాకీ జై నినాదాలు

దాదాపు రెండున్నర గంటలపాటు మిస్ వరల్డ్ ఆరంభ కార్యక్రమాలు జరిగాయి. ఈ పోటీలతో.. ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సాక్షాత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంపుపైకి రాగా.. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందినీ గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఆ ఘట్టం ఉద్విగ్నభరితంగా సాగింది. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారతదేశ జెండా కనబడగానే ‘‘భారత్‌ మాతాకీ జై’’ అనే నినాదంతో స్టేడియం మార్మోగింది. అనంతరం ప్రదర్శించిన గుస్సాడి నృత్యం అలరించింది. తెలంగాణకు ప్రత్యేకమైన కొమ్ము నృత్యం ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది. ఇక లంబాడ కళాకారుల డప్పు నృత్యం, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

తెలంగాణ గేయంతో ప్రారంభమైన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రారంభ కార్యక్రమం.. జాతీయగీతం జనగణమనతోపాటు అంతకుముందు మిస్‌వరల్డ్‌ గీతం ఆలాపనతో ముగిశాయి. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా ఖండాల వారీగా ప్రదర్శన నిర్వహించారు. కరీబియన్‌ లాటిన్‌ అమెరికా దేశాలకు చెందిన పోటీదారులతో ప్రదర్శన మొదలైంది. రెండో విడతలో ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు తమ సంప్రదాయ దుస్తులు, ప్రత్యేక వేషధారణతో ప్రదర్శన ఇచ్చారు. ఆ తరువాత యూరప్‌, ఆసియా ఖండాల వారీగా ప్రదర్శన ఇవ్వగా.. యూరప్‌ నుంచి అల్బేనియా ప్రతినిధితో మొదలైంది.

Tags:    

Similar News