TG: తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవ్
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి... శ్రీతేజ్ తండ్రికి రూ. 25 లక్షల చెక్ అందజేత;
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను చూసేందుకు మంత్రి కోమటిరెడ్డి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. బాలుడు శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి.. బాలుడి తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్ అందించారు. ప్రభుత్వం తరపున రూ. 25 లక్షలు అందంచిన మంత్రి... తన కుమారుడు పేరున స్థాపించిన ప్రతీక్ ఫౌండేషన్ తరపున మరో రూ. 25 లక్షలను వ్యక్తిగతంగా అందించారు. శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
రేవతి కుటుంబాన్ని ఆదుకుంటాం: కోమటిరెడ్డి
సంథ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీతేజ్ కు అవసరమైన ఔషదాలు ప్రపంచంలో ఎక్కడున్నా తెప్పిస్తామని ప్రకటించారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉందన్న కోమటిరెడ్డి... త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జరిగిన ఘటనపై మంత్రి క్షమాపణలు చెప్పారు.
బెనిఫిట్ షోలు రద్దు
తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలూ పెంచబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశం, సమాజం కోసం, అలాగే తెలంగాణ చరిత్ర, యువతకు సందేశాలు అందించే సినిమాలు ఏమైనా వస్తే అప్పుడు బెనిఫిట్ షోల గురించి ఆలోచిస్తామన్నారు. అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించైనా బతికించాలని వైద్యులకు సూచించారు. బాలుడి తండ్రి భాస్కర్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్కును అందించారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ బెనిఫిట్ షో చూడటానికి వెళ్లిన సమయంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని కోమటిరెడ్డి అన్నారు. వారి కొడుకు కోరడంతో రేవతి కుటుంబం సినిమా చూసేందుకు వచ్చారన్నారు. హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడంతో తోపులాట జరిగిందని... హీరో వచ్చిన సమయంలో ఆయన బౌన్సర్లు ప్రేక్షకులు, అభిమానులు అందరినీ తోసేశారని తెలిపారు. పోలీసులు వద్దని చెప్పినా, హీరో కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుకుంటూ వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీ తేజ్ ఆహారం తీసుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తెలిపారు. రేవతి ఆత్ కు శాంతి కలగాలి. పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ రావడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి.