రివ్యూ : అలప్పుళ జింఖానా
ఆర్టిస్ట్స్ : నాస్లేన్, లుక్మన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, అనఘా మాయ రవి, హబీష్ తదితరులు
ఎడిటర్ : నిషాద్ యూసుఫ్
సంగీతం : విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ : జిమ్షి ఖలిద్
నిర్మాతలు : ఖలీద్ రహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నన్ చెరీ
దర్శకత్వం : ఖలీద్ రహమాన్
ప్రేమలు చిత్రంతో ఓవర్ నైట్ తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు నాస్లేన్ అనే కుర్రాడు. మళయాలంలో మంచి రైజింగ్ స్టార్ అనిపించుకుంటున్నాడు. అతను ప్రధానంగా కనిపిస్తూ సినిమాలోని అన్ని ప్రధానమే అనిపించేలా రూపొందిన సినిమా అలప్పుళ జింఖానా. ఏప్రిల్ 10న మళయాలంలో విడుదలైన ఈ చిన్న చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 50 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి ఈ 25న విడుదల చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందనేది చూద్దాం.
కథ :
జోజో జాన్సన్ ( నాస్లేన్) తో పాటు అతని ఫ్రెండ్స్ అంతా ఇంటర్మీడియొట్ తప్పుతారు. మళ్లీ సప్లిమెంటరీ రాసినా పాస్ అవుతాం అనే నమ్మకం లేక స్పోర్ట్స్ కోటాలో పాస్ అయ్యేలా ప్లాన్ చేసి బాక్సింగ్ క్లబ్ లో జాయిన్ అవుతారు. అక్కడ వీరికి ఆంటోనీ జాషువా (లుక్మన్ అవరన్) కోచింగ్ ఇస్తాడు. మొదట సిల్లీగా మొదలుపెట్టినా జాషువా వచ్చిన తర్వాత వీరు డిస్ట్రిక్ట్ లెవల్ ఛాంపియన్ షిప్ నెగ్గి స్టేట్ లెవల్ కు వెళతారు. మరి అక్కడ వీరు విజయం సాధించారా లేదా.. అలప్పుళ జింఖానా టీమ్ కు ఎలాంటి పేరు వచ్చింది అనేది మిగతా కథ
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనగానే కొన్ని పారామీటర్స్ కనిపిస్తాయి. కానీ మళయాలంలో అలా ఉండదు అని మరోసారి నిరూపించిన సినిమా ఇది. కంప్లీట్ గా యూత్ ఫుల్ మూవీనే. ఆ వయసులో వచ్చే కొన్ని ఫీలింగ్స్ కనిపిస్తాయి. ఏదీ పరిధి దాటి ఉండదు. ఆ ఏజ్ లో ఉండే రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఏదీ అసహజంగా అనిపించదు. పూర్తిగా ఇమెచ్యూర్ ఏజ్ లో కనిపించే అమాయకత్వంతో కూడిన అతి విశ్వాసం.. తద్వారా జనరేట్ అయిన ఫన్ ఈ మూవీకి ఎసెట్స్. బాక్సింగ్ నేర్చుకుంటే గ్రేస్ మార్క్ లు వస్తాయి.. తద్వారా కొన్ని ఎక్స్ ట్రా మార్క్ లు తెచ్చుకుంటే నెక్ట్స్ క్లాస్ లోకి అప్డేట్ కావొచ్చు అని మాత్రమే అనుకున్న వీరికి బాక్సింగ్ తాము అనుకున్నంత సులువు కాదు అని అర్థమైన తర్వాత కూడా నాన్ స్టాప్ వినోదంతో అదరగొట్టారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే బోలెడంత ఎమోషన్, కావాల్సినంత రివెంజ్, అన్నిటికి మంచి దేశాన్నో రాష్ట్రాన్నో రిప్రెజెంట్ చేస్తారు కాబట్టి హీరో లేదా అతని టీమ్ గెలిచి తీరాల్సిందే అనే రొడ్డకొట్టుడు స్క్రీన్ ప్లే చూసి ఉన్నాం ఇన్నాళ్లూ. కానీ ఇది అందుకు పూర్తి భిన్నమైన కథ, కథనంతో కూడిన సినిమా. ఆ పాత టెంప్లేట్ మూవీస్ ను ఎక్స్ పెక్ట్ చేసి వెళితే నిరాశపడతారు కానీ, నిజంగా ఇలా జరిగేందుకు వందశాతం ఆస్కారం ఉందన్న వాస్తవ దృక్పథంతో చూస్తే వంద శాతం వినోదం అందుకుంటారు. నాస్లేన్ హీరోలాగా కనిపిస్తాడు కానీ.. ప్రతి పాత్రలోనూ హీరోయిజం ఉంటుంది. ఇంకా చెబితే నాస్లేన్ బాక్సింగ్ లో తేలిపోతాడు. మిగతా వాళ్లు అదరగొడతారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో సెగ్మెంట్ ఉంటుంది. ప్రతి సెగ్మెంట్ లోనూ ఓ హై మూమెంట్, ఓ డల్ మూమెంట్, మరో బ్యాడ్ మూమెంట్ ఉంటాయి. ఈ తరహా కథలను పూర్తిగా విశ్లేషించడం కంటే కూడా చూస్తేనే ఆ వినోదాన్ని ఆస్వాదించొచ్చు.
ఇక మళయాల సినిమాల టెంప్లేట్ లోనే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగానే సాగుతుంది. అక్కడక్కడా ఆకట్టుకునేలా ఉన్నా.. సడెన్ గా వీళ్లు బాక్సింగ్ రింగ్ లో కి అడుగుపెట్టి గెలిచేయడం.. కాస్త అతిశయోక్తిలా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి వినోదంతో కూడిన ‘స్పోర్ట్స్ కామెడీ’ని ఆస్వాదించొచ్చు. లవ్ ట్రాక్స్ అని పెట్టారు కానీ.. వాటికి న్యాయం చేయలేదు. నిజానికి ఆ వయసుకు తగ్గ కథనం అది. ఆ వయసులో ప్రతి అమ్మాయినీ ప్రేమించాలనే అనిపిస్తుంది కదా. ఆ ఇన్నోసెన్స్ నే అర్థం చేసుకోవాలి తప్ప.. ఇవి లవ్ ట్రాక్స్ అని భావించకూడదు.
నటన పరంగా నాస్లేన్ నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. హీరోలా కనిపించే అతను బాక్సింగ్ రింగ్ లో తేలిపోవడం సగటు సినిమాలను ఇష్టపడేవారికి నచ్చకపోయినా వాస్తవికంగా చూడాలి. మిగతా పాత్రల్లో కోచ్ గా లుక్మన్ బాగా చేశాడు. దీపిక్ పణిక్కర్ గా గణపతి, పెద్ద షిఫాస్ గా సందీప్, చిన్న షిఫాస్ గా ఫ్రాంకో, డిజే గా హబిష్ నటాషాగా అనఘా మాయారవి చాలా సహజంగా చేసుకుంటూ పోయారు.
టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉందీ మూవీ. తెలుగు పాటలు పెద్దగా ఆకట్టుకోవు కానీ.. నేపథ్య సంగీతం ఫంకీగా కథనాన్ని బాగా ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఎడిటింగ్ తెలుగు వరకూ షార్ప్ గా కనిపిస్తుంది. తెలుగు డైలాగ్స్ బావున్నాయి. తెలుగులో పాపులర్ అయిన అన్ని అంశాలను బాగా ఇన్ బిల్ట్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. దర్శకుడు ఖలీద్ రహమాన్ యూత్ ను టార్గెట్ చేసుకుని ఎక్కడా అసభ్యత, అశ్లీలత లేకుండా ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ ను అందించాడు.
ఫైనల్ గా : కామెడీ పంచ్ లు అదిరాయి
రేటింగ్ : 2.75/5
- బాబురావు. కామళ్ల