Devarakondalo vijay prema katha : 'దేవరకొండలో విజయ్ ప్రేమ కథ' మూవీ రివ్యూ

Devarakondalo vijay prema katha..ఆహ్లదకరమైన ప్రేమకథ

Update: 2021-03-11 10:00 GMT

టైటిల్ : దేవరకొండలో విజయ్ ప్రేమ కథ

నటీనటులు : మౌర్యానీ, విజయ్ శంకర్, నాగినీడు, వెంకట గోవిందరావు, శివన్నారాయణ, కోటేశ్వరరావు, రచ్చరవి, సునీత, శిరిరాజ్, చలపతిరావు, సాయిమణి, సుభాష్ రెడ్డి నల్లమిల్లి తదితరులు

సంగీతం : సదాచంద్ర

ఎడిటర్ : కేఏవై పాపారావు

పొటోగ్రఫీ : జి అమర్

సాహిత్యం : చంద్రబోస్, భాస్కరభట్ల, వనమాలి, కాసర్ల శ్యాం

మాటలు : వై సురేష్ కుమార్

ఫైట్స్ : అవినాష్

నిర్మాత : పడ్డాన మన్మథరావు

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : వెంకటరమణ ఎస్

ప్రేమ కథలు వినోదాత్మకంగా తెరకెక్కుతుంటాయి. సందేశాత్మక ప్రేమ కథలు రావడం అరుదు. దేవరకొండలో విజయ్ ప్రేమ కథ చిత్రంతో అలాంటి అరుదైన ప్రయత్నం చేశారు దర్శకుడు ఎస్ వెంకటరమణ. విజయ్ శంకర్, మౌర్యానీ జంటగా నటించిన ఈ సినిమా దేవరకొండ లో విజయ్ ప్రేమకథ. మహా శివరాత్రి సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవరకొండలో విజయ్ ప్రేమ కథ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ :

దేవరకొండ గ్రామంలో ఊరి పెద్ద సీతారామయ్య (నాగినీడు). ఆయన ఒక్కగానొక్క కూతురు దేవకి (మౌర్యానీ). అదే ఊరిలో ఆటో నడుపుకునే విజయ్ (విజయ్ శంకర్) కు దేవకి చిన్నప్పటి స్నేహితురాలు. ఇద్దరూ ప్రేమలో ఉన్నా అది బయటవాళ్లకు తెలియదు. రోజూ కాలేజ్ కు వెళ్లే దేవకిని దూరంగా చూస్తూ చూపులతో పలకరిస్తుంటాడు విజయ్. దేవకి కాలికి గాయం కావడంతో ఆటోలో రోజూ కాలేజ్ కు తీసుకెళ్లమని తండ్రి సీతారామయ్య విజయ్ కు చెప్తాడు. దేవకి, విజయ్ మాట్లాడుకుంటుండగా సీతారామయ్య మేనల్లుడు చూసి గొడవ చేస్తాడు. తన కూతురు ప్రేమ సంగతి తెలిసిన సీతారామయ్య ఊరి వాళ్ల ముందు తన పరువు తీసిందనే కోపంతో దేవకి, విజయ్ లను ఊరి నుంచే వెలివేస్తాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పొలిమేరలో పాడుబడిన ఇంట్లో కాపురం ఉంటారు విజయ్, దేవకి. సంతోషంగా సాగుతున్న వీరి జీవితానికి కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు ఏంటి, వాటిని ఈ జంట ఎలా ఎదుర్కొని జీవితంతో పోరాడారు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రేమతో ఎలా కలిసి ఉన్నారు అనేది మిగిలిన కథ.


విశ్లేషణ :

దేవరకొండలో విజయ్ ప్రేమ కథ తొలి భాగం సరదాగా సాగిపోతూ ఉంటుంది. హీరో విజయ్ క్యారెక్టర్ జోష్ ఫుల్ గా మొదలవుతుంది. అతని ఫ్రెండ్ చేసే కామెడీ సన్నివేశాలు వస్తూ నవ్విస్తుంటాయి. కరణం పాత్రలో శివన్నారాయణ నవ్విస్తారు. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఇంట్లో భోజనానికి వెళ్లి వాళ్లను ఇబ్బంది పెట్టే ఆయన క్యారెక్టర్ నవ్విస్తుంది. తెలంగాణ బామ్మర్ది యాదగిరి పాత్రలో రచ్చ రవి సందడి చేశాడు. అతనిది చిన్న క్యారెక్టర్ అయినా ఉన్న సీన్స్ లో కామెడీ పండించాడు. ఊరి పెద్ద సీతారామయ్య పాత్రలో నాగినీడు చాలా సహజంగా కనిపించారు. కూతురంటే ప్రేమ ఉన్నా, పరువు, గౌరవం కోసం కట్టుబడిన ఆయన క్యారెక్టర్ నిజ జీవితంలో చాలా మందిలో చూస్తుంటాం. విజయ్ శంకర్ తొలిభాగంలో సరదాగా, ద్వితీయార్థంలో ఎమోషనల్ గా నటించాడు. ఫైట్స్, పాటల్లో బాగా కనిపించాడు.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం నాయిక మౌర్యానీ నటన. దేవకి పాత్రలో సినిమాకు ప్రాణం పోసింది మౌర్యానీ. తండ్రికి ఎదురుచెప్పలేక, ప్రేమించిన వాడిని వదులుకోలేక దేవకి పాత్ర పడే సంఘర్షణ మౌర్యానీ నటనలో చూపించింది. ఇంటర్వెల్ తర్వాత నుంచీ కథను తానే నడిపిస్తుందీ నాయిక. చాలా సన్నివేశాల్లో కంటతడి పెట్టించేలా నటించింది మౌర్యానీ. ముఖ్యంగా మహిళలను దేవరకొండలో విజయ్ ప్రేమ కథ ఉద్వేగానికి గురిచేస్తుంది. దర్శకుడు ఎస్ వెంకటరమణ ప్రేమ కథను సరదాగానే కాకుండా మంచి సందేశంతో రూపొందించారు.

సమాజంలో మన చుట్టూ జరుగుతున్న ఓ తప్పును, మనకు తెలియకుండానే తయారు చేస్తున్న ప్రమాదాన్ని అంశంగా చెప్పడం అభినందనీయం. ఇలా సందేశాన్ని చెబుతూనే సినిమాను ఆద్యంతం సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని సీన్స్ మన ఊరిలో కళ్ల ముందు జరుగుతున్నట్లు అనిపిస్తాయి. కథను వదిలి కమర్షియల్ అంశాల కోసం దర్శకుడు ఫీట్లు చేయలేదు. కథానుసారం కామెడీ, ఫైట్స్, పాటలు చేసుకుంటూ వెళ్లాడు. ఒక మంచి సినిమా చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు. పాటల్లో నువ్వో సగం, నేనో సగం, ఆనందం మా ఇంటి తోరణమై వచ్చింది వంటి పాటలు ఆకట్టుకుంటాయి. ఈ అందమైన ప్రేమ కథకు ఆహ్లాదకరమైన లొకేషన్స్ అలరిస్తాయి.

చివరిగా:

ఆహ్లదకరమైన ప్రేమకథ

- కుమార్ శ్రీరామనేని

Tags:    

Similar News