రివ్యూ : దిల్ రుబా
ఆర్టిస్టులు : కిరణ్ అబ్బవరం, రుక్షర్ థిల్లాన్, కేథీ డేవిసన్, జాన్ విజయ్, సత్య, నరేన్, గెటప్ శ్రీను, తులసి తదితరులు
ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్
సంగీతం : శ్యామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్
నిర్మాతలు : విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోష్, రాకేశ్ రెడ్డి
దర్శకత్వం : విశ్వ కరుణ్
‘క’ మూవీతో తిరుగులేని హిట్ కొట్టి ఇప్పటి వరకూ తనపై ఉన్న విమర్శలకు సమాధానం చెప్పాడు కిరణ్ అబ్బవరం. ఆ ఊపును కొనసాగిస్తాడు అనేలా దిల్ రుబా మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ బావుంది. పాటలు బావున్నాయి. ప్రమోషన్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. విశ్వ కరుణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి దిల్ రుబా మనసులు దోచుకుందాం లేదా అనేది చూద్దాం.
కథ :
చిన్నప్పటి నుంచి ప్రేమించిన మ్యాగీ(కేథీ డేవిసన్) తనను వదిలి వెళ్లిపోయిందని చిన్నపాటి దేవదాస్ అవుతాడు సిద్ధు( కిరణ్ అబ్బవరం). చదువు కూడా మధ్యలో ఆపేస్తాడు. అతనికి సారీ, థ్యాంక్స్ చెప్పడం అస్సలు అలవాటు ఉండదు. తల్లి సలహా మేరకు మిగిలిన చదువును మంగుళూరులో పూర్తి చేయాలని అక్కడ జాయిన్ అవుతాడు. మంగుళూరు వెళ్లిన మొదటి రోజే అతను చేసిన ఓ సాయం వల్ల అతనితో ప్రేమలో పడుతుంది అంజలి( రుక్షర్ థిల్లాన్). తర్వాత అతనూ తన కాలేజ్, క్లాస్ అని తెలుసుకుంటుంది. అంజలి ప్రేమను పదే పదే రిజెక్ట్ చేస్తాడు సిద్ధు. కొంత కాలం తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి తనూ ఆమెను ప్రేమిస్తాడు. ఆ కాలేజ్ లోని మరో ఆవారా అంజలిని ఇబ్బంది పెడుతుంటాడు. సిద్ధు అడ్డుకుంటాడు. కాలేజ్ గొడవలు పోలీస్ స్టేషన్ వరకూ వెళుతుంది. అక్కడ అంజలికి జరిగిన అవమానం వల్ల అతన్ని వదిలేస్తుంది. వీరిని కలిపేందుకు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన మ్యాగీ 8 నెలల గర్భంతో సిద్ధు వద్దకు వస్తుంది. మరోవైపు సిద్ధును చంపాలని జోకర్ (జాన్ విజయ్) అనే వ్యక్తి ప్రయత్నిస్తుంటాడు. మరి అతనెవరు..? సిద్దు, అంజలి కలుస్తారా.. అందుకు మ్యాగీ వల్ల వచ్చిన సమస్యలేంటీ అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
ట్రైలర్ లోనే ఇది ముక్కోణపు ప్రేమకథ అనేలా అర్థం చేయించాడు దర్శకుడు. కానీ కాదు. ఒక ప్రేమ తర్వాత మరో ప్రేమ ఎంటర్ అవుతుంది. మ్యాగీని వదిలేయడానికి హీరోకు ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఎపిసోడ్ పెట్టాడు. కానీ అది వెరీ రొటీన్ గా అనిపిస్తుంది. ఆమె అతన్ని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టించుకోడు. కాలేజ్ కి వెళ్లిన తర్వాత ప్రేమకథలోనూ కొత్తదనం కనిపించదు. కాకపోతే బోర్ కొట్టదు. తనను వదిలివెళ్లేందుకు చివరి ప్రయత్నంగా సిద్ధు ఆమెను ఓ ‘చోట’10 నిమిషాలు నిలబడమని చెబుతాడు. ఇది కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కు అప్పటికే అలవాటు పడి ఉండటం వల్ల ఓకే అనిపిస్తుంది. తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ 1950ల కంటే ముందు నుంచీ వస్తున్నదే కావడంతో అదో పెద్ద మైనస్ అవుతుంది. ప్రెగ్నెంట్ గా ఉన్న మ్యాగీ మంగుళూరు రావడం.. అక్కడి నుంచి కథలో ఏమైనా మలుపులు, మార్పులు ఉంటాయా అనుకుంటే అదీ లేదు అని తేల్చేస్తాడు. ఇక విలన్ ఎంట్రీ, అతని రివెంజ్ ఇవన్నీ సిల్లీగానే అనిపిస్తాయి. కాకపోతే ఒకదాని తర్వాత ఒకటీగా వచ్చే సన్నివేశాలు మరీ అంతగా ఆలోచించేలా చేయవు. కిరణ్ అబ్బవరం ఫైట్లు నచ్చకపోతే నన్ను కొట్టండి అన్నాడు ఆ మధ్య నిర్మాత. హ్యాపీగా అతన్ని కొట్టేయొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్స్ పెద్ద గొప్పగా ఏం లేవు.
ఇక ‘సారీ’, ‘థ్యాంక్స్’ అనే పదాలకు ఉన్న విలువను ప్రేక్షకులకు తెలియజేసే మహత్తర బాధ్యత నెత్తిమీద తీసుకున్న దర్శకుడు ఆ క్రమంలో రాసుకున్న సన్నివేశాలు మరీ అంత బలంగా లేకపోవడంతో చూసిన వాళ్లు ‘సారీ’ అనే ప్రమాదం లేకపోలేదు.
నటన పరంగా చూస్తే.. కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇంకా ట్రెయినింగ్ అవసరమేమో అనిపిస్తుంది. రుక్షర్ థిల్లాన్ పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. చాలా ఛలాకీగా, హుషారుగా ఉండే పాత్ర. తను అదరగొట్టింది. క్యారెక్టర్ ను బాగా ఓన్ చేసుకుంది. ఓ రకంగా సినిమాలో ఆమె నటనే హైలెట్ అంటే అతిశయోక్తి కాదు. మ్యాగీగా నటించిన కేథీలో ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా తెలియలేదు. ఆడుకాలం నరేన్ అంజలి ఫాదర్ గా మెప్పించాడు. జాన్ విజయ్ ఎప్పట్లానే తీవ్రమైన అతి నటనతో విసిగించాడు. కిరణ్ పేరెంట్స్ గా ఆనంద్, తులసి గెస్ట్ పాత్రలకు ఎక్కువ అన్నట్టుగా ఉన్నారు. సత్య కామెడీ పేలలేదు. గెటప్ శ్రీను పిఏ గా పరిమితం అయ్యాడు. మిగతా అంతా జస్ట్ ఓకే.
టెక్నికల్ గా మ్యూజిక్ హైలెట్. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మాటలు మెప్పిస్తాయి. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపించాయి. ఫైట్స్ జస్ట్ యావరేజ్. దర్శకుడు విశ్వ కరుణ్ సారీ, థ్యాంక్స్ ల గురించి చెప్పాలనుకున్నాడు. అందుకు తగ్గ బలమైన రైటింగ్ అయితే కనిపించదు. కాకపోతే కొన్ని సీన్స్ ను బాగా హ్యాండిల్ చేశాడు. టేకింగ్, మేకింగ్ బానే ఉంది. బలమైన కథనం పడి ఉంటే నిజంగానే ప్రేక్షకుల దిల్ దోచుకునేవాడేనేమో.
ఫైనల్ గా : జస్ట్ ఓకే
రేటింగ్ : 2.25/5
బాబురావు. కామళ్ల