రివ్యూ : సారంగపాణి జాతకం
తారాగణం : ప్రియదర్శి, రూపా కొడువయూర్, నరేష్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : పిజి విందా
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీస్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమాల్లో పెద్దగా హడావిడీ ఉండదు. మంచి వినోదం కనిపిస్తుంది. అతి అనేది అస్సలు కనిపించదు. ఇక తను ఎంచుకునే కథలతో బాగా ఆకట్టుకుంటున్నాడు ప్రియదర్శి. హీరోగా విజయాలు సాధిస్తున్నాడు. కోర్ట్ మూవీ తర్వాత సారంగపాణిగా అదీ ఇంద్రగంటి సినిమాలో నటించాడు అన్నప్పుడే ఈ మూవీపై అంచనాలు మొదలయ్యాయి. మంచి ప్రమోషన్స్ తో మెప్పించిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఎలా ఉంది అనేది చూద్దాం.
సారంగపాణి(ప్రియదర్శి)కి చిన్నప్పటి నుంచి జాతకాల పిచ్చి. అన్నీ తల రాతల్లోనూ, చేతి గీతల్లోనూ ఉన్నాయని నమ్ముతాడు. తను ఓ కార్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. అదే ఆఫీస్ లో మేనేజర్ అయిన జాతకాలపై అస్సలు నమ్మకమే లేని మైథిలి (రూపా కొడువయూర్)ని ప్రేమిస్తాడు. అతనికంటే ముందే ఆమె అతనికి ఐ లవ్యూ చెబుతుంది. ఇరు కుటుంబాలూ ఇద్దరికీ పెళ్లి చేయడానికి ముహూర్తాలు చూస్తుంటారు. అంతా హ్యాపీ అనుకుంటోన్న టైమ్ లో ఓ పామిస్ట్ అయిన జోగీశ్వర్ (అవసరాల శ్రీనివాస్) సారంగపాణి కోరిక మేరకు చెయ్యి చూసి అతని జాతకంలో ఓ మర్డర్ చేయాల్సి ఉందనే విషయం చెబుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది..? ఇతను మర్డర్ చేశాడా..? నిజంగా సారంగపాణి జాతకంలో మర్డర్ చేయాలని ఉందా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
ఇలాంటి కథల్లో ‘కథ’ ఏంటీ అనేది ముందే తెలిసిపోతుంది. అందుకే కథనంతో కట్టిపడేయాలి. అంటే కామెడిని నమ్ముకోవాలి. మంచి ఆర్టిస్టులున్నారు కాబట్టి మంచి రైటింగ్ కూడా పడితే కామెడీ నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తుంది. సారంగపాణిలోనూ అదే కనిపిస్తుంది. అలాగని మరీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించలేదు కానీ.. చూస్తున్నంత సేపూ మొహంపై నవ్వు చెరిగిపోదు. సారంగపాణి పాత్ర మర్డర్ విషయంలో తన ఫ్రెండ్ చంద్ర(వెన్నెల కిశోర్)తో కలిసి చేసే ప్రయత్నాలన్నీ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి. పాపతో చాక్లెట్ సీన్. అంతకు ముందు బామ్మ ఎపిసోడ్ బాగా నవ్వించాయి. అచ్చం ఇలాగే కనిపించే హీరోయిన్ బర్త్ డే ఎపిసోడ్ మరో లెవల్ లో ఉంది. ఈ క్రమంలో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ తో నెక్ట్స్ ఏంటీ అనేది తెలిసిపోయినా.. ఆ పర్టిక్యులర్ విషయం కోసం సారంపాణి పడే బాధ అతనికి, చంద్రకు తప్ప మిగతా పాత్రలకు తెలియకపోవడం.. ప్రేక్షకులకు తెలియడం వల్ల మంచి ఫన్ జనరేట్ అయింది. ఫస్ట్ హాఫ్ తో బ్రేకప్ అయిన కథ సెకండ్ హాఫ్ లో మర్డర్ కోసం మరోసారి ఆ పామిస్ట్ ను కలవడంతో కొత్త టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి కథ వైజాగ్ షిఫ్ట్ అవుతుంది. హీరోయిన్ ఇచ్చిన రెండు వారాల గడువులో హీరో ఏం చేశాడు అనే కోణంలో చివరి 40 నిమిషాలు నాన్ స్టాప్ గా నవ్వించారు. కథనంలో కొన్ని పాత సినిమాలు గుర్తొచ్చినా.. ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ తరానికీ నచ్చేలా మంచి డైలాగ్స్ తో పాటు సీన్స్ తో అదరగొట్టాడు ఇంద్రగంటి. వైవా హర్ష పాత్ర ఎంట్రీతో నవ్వులు డబుల్ అయ్యాయి.పేరెంట్స్ పాత్రలతోనూ అద్భుతమైన కామెడీని రాబట్టుకున్నాడు దర్శకుడు.
జాతకాల పిచ్చి అనగానే మనకు లేడీస్ టైలర్, ఆ ఒక్కటీ అడక్కు లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోనే సాగుతుంది. లేడీస్ టైలర్ లో హీరోయిన్ పుట్టు మచ్చ కోసం హీరో పాకులాడతాడు..ఇక్కడ హీరోయిన్ క్షేమం కోసం జాతకం వల్ల మర్డర్ చేయడానికి కూడా వెనకాడడు హీరో. కథల్లో సిమిలారిటీస్ ఉన్నా.. కథనంలో అవి కనిపించవు. ముఖ్యంగా ఆ రెండు సినిమాల్లోనూ కాస్త అడల్ట్ డోస్ చాలా కనిపిస్తుంది. ఈ మూవీలో అలాంటిదేం ఉండదు. క్లీన్ కామెడీ. డబుల్ మీనింగ్, అశ్లీలత అనేది అస్సలు కనిపించదు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అలాగే ఆ రెండు సినిమాల స్థాయిలో విజయం సాధించే అవకాశం కూడా ఉందీ సారంగపాణికి.
మరి మైనస్ లే లేవా అంటే ఉన్నాయి. కాకపోతే ఇలాంటి మూవీస్ లో మైనస్ లు వెదకడం కంటే.. హ్యాపీగా నవ్వుకునే అవకాశం ఉన్న ప్రతి చోటా ఆ నవ్వులేవో నవ్వేస్తే హ్యాపీగా ఉంటుంది. లేని పోని తప్పులు వెదుకుతూ ఉన్న కాస్త ఆనందాన్ని ఆవిరి చేసుకోవడం వృథా కదా..?
నటన పరంగా ప్రియదర్శి చాలా బాగా నటించాడు. జాతకాల పిచ్చి, ప్రేమికుడుగా, మర్డర్ చేయడం కోసం తంటాలు పడే పాత్రగా, తన ఫ్రస్ట్రేటెడ్ పర్సన్.. ఇలా చాలా వేరియేషన్స్ ను అలవోకగా పండించాడు. రూపా చాలా బాగా నటించింది. ఈ పాత్ర తనకు బాగా సూట్ అయింది. అవసరాల శ్రీనివాస్ నటనతో పాటు గెటప్ బావుంది. వెన్నెల కిశోర్ ఈ మధ్య చిన్న సినిమాలకు బ్యాక్ బోన్ అవుతున్నాడు. మరోసారి అలాగే కనిపించాడు. వైవా హర్ష అమాయత్వంలో నుంచి మంచి కామెడీ జెనరేట్ అయింది. నరేష్ కు కొత్త పాత్రేం కాదు. శ్రీనివాస్ వడ్లమాని ప్రామిసింగ్ ఫాదర్ రోల్స్ లోకి షిఫ్ట్ అవుతున్నాడు. రూపాదేవి, కల్పలత, తనికెళ్ల భరణి, చివర్లో వచ్చిన రాజా చెంబోలుతో పాటు ఇతర పాత్రలన్నీ ఎవరికి వారు సహజంగా చేసుకుంటూ పోయారు.
టెక్నికల్ గా వివేక్ సాగర్ సంగీతంలోని పాటలు పెద్దగా అర్థం కాలేదు. కానీ సౌండింగ్ బావుంది. నేపథ్య సంగీతం ఈ తరహా కామెడీ సినిమాలకు సరిపోయేలా ఉంది. ఎడిటింగ్ బావుంది. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. డైలాగ్స్ బాగా కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. దర్శకుడుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తన స్ట్రెంత్ తెలిసి రాసుకున్న కథ ఇది. ఓ భారీతనం అక్కర్లేదు. సింపుల్ గా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుకుంటే చాలు అన్నట్టుగా రాసుకున్నాడు. బాగా తీశాడు కూడా. సో.. ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తానికి మంచి ఛాయిస్ గా ఈ చిత్రాన్ని చెప్పొచ్చు.
ఫైనల్ గా : సారంగపాణి జాతకం.. భేషూగ్గా ఉంది.
రేటింగ్ : 3.25/5
- బాబురావు కామళ్ల