రివ్యూ : తమ్ముడు
ఆర్టిస్ట్స్ : నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, శ్వాసిక, సౌరభ్ సచ్ దేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, హరితేజ తదితరులు
ఎడిటర్ : ఎస్.హెచ్. ప్రవీణ్ పూడి
సంగీతం : అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ : కేవి గుహన్, సమీర్ రెడ్డి, సేతు
నిర్మాత : శిరీష్
దర్శకత్వం : శ్రీరామ్ వేణు
తమ్ముడు.. పవన్ కళ్యాణ్ నటించిన హిట్ మూవీ. ఈ మూవీ టైటిల్ తో అతని ఫ్యాన్ అయిన నితిన్ హీరోగా సినిమా అనౌన్స్ అయినప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంది. సినిమా బాగా లేట్ అయింది. రెండేళ్లకు పైగా సాగింది. రకరకాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయి పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ కు ముందు అనుకోని వివాదం కూడా కలిసొచ్చింది. అయినా ప్రమోషనల్ గా మాత్రం మరీ అంతగా ఆకట్టుకోలేదీ మూవీ. ఫైనల్ గా ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ తమ్ముడు ఆ తమ్ముడిలా ఆకట్టుకున్నాడా లేదా అనేది చూద్దాం.
కథ :
జై (నితిన్ ) ఒక ఆర్చర్. ఢిల్లీలో ఉంటాడు. ఇండియాకు గోల్డ్ మెడల్ తేవాలనేది అతని కల. కానీ ఆ కలపై సరిగా గురిపెట్టలేక డిస్ట్రబ్ అవుతుంటాడు. అందుకు కారణమేంటీ అని అతని ఫ్రెండ్ చిత్ర (వర్ష బొల్లమ్మ) అడుగుతుంది. అప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. అందులో తన అక్క స్నేహలత ( లయ) గురించి చెబుతాడు. జై కి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోతుందా అక్క. మళ్లీ ఇన్నేళ్లకు అక్క జ్ఞాపకాలు ఇబ్బంది పెడుతున్నాయి అంటాడు. దీంతో ఇద్దరూ కలిసి ఆమెను వెదుకుతూ వైజాగ్ వస్తారు. తన అక్క ఝాన్సీ కిరణ్మయి అనే పేరు కూడా మార్చుకుని పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అయిందని తెలుసుకుంటాడు. ఆ క్రమంలో ఆమె మామగారి మొక్కు తీర్చడం కోసం కుటుంబంతో కలిసి పుష్కరానికి ఒకసారి వచ్చే ‘అంబరగుడి’ ఆలయానికి వెళ్లిందని తెలుసుకుని తామూ బయలు దేరతారు. అదే టైమ్ లో అజర్ వాల్ ఒక సంతకం చేయించమని, అవసరమైతే ఝాన్సీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయమని మనుషుల్ని పంపిస్తాడు. మరి ఈ అజర్ వాల్ ఎవరు..? ఆమెను ఎందుకు చంపాలనుకుంటున్నాడు..? అక్కా తమ్ముడు కలుసుకున్నారా..? అక్కను తమ్ముడు కాపాడుకున్నాడా లేదా అనేది కథ.
ఎలా ఉంది :
కొన్ని కథలు పేపర్ మీద అందంగా ఉంటాయి. వెండితెర మీద మాత్రం చిరాకు పెడతాయి. తమ్ముడు ఈ రెండో కోవకు చెందిన వాడే. చాలా గ్రిప్పింగ్ గా, ఇంటెన్సిటీతో చెప్పడానికి అన్ని రకాలుగా ఆస్కారం ఉన్న కథ. కానీ కథనం అందుకు విరుద్ధంగా ఉంటుంది. అదే పనిగా వచ్చే సబ్ ప్లాట్స్ ఫ్లోను చెడకొడుతుంటే.. దర్శకుడు తన ఇష్టానికి తీసుకుంటూ వెళ్లిపోయాడు. మొదటి అరగంట మినహాయిస్తే తర్వాతి కథంతా ఒక్క రాత్రిలో జరిగేదే. ఇలాంటి కథలను ఎంత గ్రిప్పింగ్ గా చెబితే అంత ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా తేలిపోయాడు. వీలైనంత ఎక్కువ చిరాకు పెట్టే ప్రయత్నమే ఎక్కువగా చేశాడు. ఒక్క రాత్రి సర్వైవ్ అయితే ఆ ఫ్యామిలీ సేఫ్ అనే పెద్ద టాస్క్ తో మొదలైన కథనం ఆ టాస్క్ ను ఛేదించే క్రమంలో రాసుకున్న సీన్స్ చాలా వరకూ రిపీటెడ్(ముఖ్యంగా ఫైట్లు) గా అవుట్ డేటెడ్ గానే ఉన్నాయి. 12 మంది కుటుంబంలో ముగ్గురు పిల్లలు, ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంటుంది. ఆ రాత్రి అడవిలోనే తను డెలివరీ అవుతుంది కూడా. ఇవన్నీ ఎంత ఇల్లాజికల్ గా ఉన్నాయో చెప్పలేం. హీరో కాబట్టి ఎంతమందినైనా కొట్టేస్తాడు అని కాకుండా కాస్త బుర్రక పదును పెట్టేలా.. శతృవులను దారి మల్లిస్తూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ ఎంతమందిని కొడుతున్నా.. ఇంకా ఇంకా వస్తూనే ఉంటారు. అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అదేదో షోలో అన్నట్టుగా తెల్లార్లూ ఫైట్లే అంటే కష్టం కదా..? ఇక ఆడవాళ్లు చాలమంది ఉన్నారు కాబట్టి వర్ష బొల్లమ్మకూ ఓ యాక్షన్ సీన్ ఉంటుంది. అది ఎంత అవుట్ డేటెడ్ అంటే బ్లాక్ అండ్ వైట్ టైమ్ లో కూడా లేదు. మరి ప్లస్ పాయింట్సే లేవా అంటే ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బావున్నాయి. అంత వరకే. కానీ రైటింగ్ చాలా వీక్ గా ఉండటం చాలా పెద్ద మైనస్ గా మారింది.
నటన పరంగా చూస్తే నితిన్ పాత్రలో ఎక్కడా హుషారు కనిపించదు. ఫైట్లు సైతం ఏమంత ఆకట్టుకోలేదు. చాలా డల్ గా ఉన్నాడు. నిజానికి ఆ పాత్రను అలానే డిజైన్ చేశాడు దర్శకుడు. దీని వల్ల నితిన్ తేలిపోయాడు. వర్ష బొల్లమ్మ పాత్ర, నటన బావుంది. లయ బాగా నటించింది. అన్ని ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా పలికించింది. సప్తమి గౌడ పాత్ర అసహజంగానూ అతిగానూ కనిపించింది. తన పాత్ర వరకు తను బానే చేసింది. కానీ ఆ పాత్రలో దమ్ము లేదు. శ్వాసిక నెగెటివ్ రోల్ బానే ఉంది కానీ అవుట్ డేటెడ్. ఆశ్చర్యంగా ఇంత కాస్టింగ్ ఉన్న మూవీలో విలన్ పాత్ర ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో సౌరభ్ సచ్ దేవ్ బాగా చేశాడు. ఇతర పాత్రల్లో హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ రెగ్యులర్ రోల్స్ లో ఓకే అనిపించేశారు.
టెక్నికల్ గా చూస్తే వీక్ మూవీస్ కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టిన అజనీష్ లోక్ నాథ్ ఈ సారి ఆ పనిచేయలేకపోయాడు. అతను ఏదో చేసేందుకు దర్శకుడు ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు. అయినా ఓకే అనిపించాడు. హైలెట్ కాలేదు కానీ మైనస్ కూడా కాలేదు. సినిమాటోగ్రఫీ ముగ్గురు హ్యాండిల్ చేసినట్టున్నారు. బానే ఉంది. డైలాగ్స్ గుర్తు పెట్టుకునేలా లేవు. క్లైమాక్స్ ఫైట్ లో విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తిగా తేలిపోయింది. ఇవి కాక ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఎడిటింగ్ పరంగా చాలా ట్రిమ్ చేయొచ్చు. దర్శకుడుగా శ్రీరామ్ వేణు కథ, స్క్రీన్ ప్లే వేసుకున్నాడు. కానీ ఈ రెండే ప్రధాన లోపాలు ఈ చిత్రానికి. సో.. ఈ చిత్ర వైఫల్యానికి పూర్తిగా దర్శకుడిదే బాధ్యత అనుకోవచ్చు. పూర్ రైటింగ్, బోరింగ్ స్క్రీన్ ప్లే.
ఫైనల్ గా : అడవిలోనే దారితప్పిన ‘తమ్ముడు’
రేటింగ్ : 1.75 / 5
- బాబురావు కామళ్ల