Thug Life Movie Review : రివ్యూ : ఆడియన్స్ తో ఆడుకున్న థగ్ లైఫ్..

Update: 2025-06-05 10:43 GMT

రివ్యూ : థగ్ లైఫ్

తారాగణం : కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, నాజర్, మహేష్ మంజ్రేకర్, జోజూ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ తదితరులు

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

సంగీతం : ఏఆర్ రహమాన్

సినిమాటోగ్రఫీ : రవి కే చంద్రన్

నిర్మాతలు : మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్

దర్శకత్వం : మణిరత్నం

లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ లో ఉంటాయి. 35యేళ్ల క్రితం నాయకుడు అనే క్లాసిక్ తో ఆకట్టుకున్న కమల్ హాసన్, మణిరత్నం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సినిమా చేస్తున్నారంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. అలాంటి క్రేజీ కాంబినేషన్ తో పాటు శింబు, త్రిష, జోజూ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వంటి టాలెంటెడ్ కాస్టింగ్ కూడా యాడ్ అయితే ఇంకేం చెబుతాం. సో.. అలాంటి టాప్ ప్యాకేజ్ తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రంగరాయ శక్తిరాజు(కమల్ హాసన్) ఓ గ్యాంగ్ స్టర్. ఏళ్ల తరబడి శక్తిరాజుకు సదానంద్( మహేష్ మంజ్రేకర్) తో వైరం ఉంటుంది. అటు పోలీస్ లు సైతం ఎప్పటికప్పుడు వీరి కోసం చూస్తుంటారు. అలా మూడు దశాబ్దాల క్రితం ఓ గ్యాంగ్ వార్ లోకి ఎంటర్ అయిన పోలీస్ ల నుంచి తప్పించుకునే క్రమంలో శక్తిరాజు టీమ్ అనుకోకుండా ఓ పేపర్ వేసే వ్యక్తిని కాల్చేస్తారు. అతని అమర్ అనే కొడుకు ఉంటాడు. ఆ పిల్లాడిని ‘షీల్డ్’ గా వాడుకుంటూ శక్తి రాజు తప్పించుకుంటాడు. తర్వాత అమర్ ను తనే పెంచుతాడు. శక్తిరాజుకు భార్య లక్ష్మితో పాటు ఇంద్రాణి(త్రిష) అనే ‘కీప్’ కూడా ఉంటుంది. ఈ కాలానికి వస్తే శక్తి రాజు అన్న (నాజర్) కూతురు సదానంద్ మేనల్లుడి వల్ల మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రతీకారంగా అతన్ని చంపేస్తాడు శక్తిరాజు. ఆ కేస్ లో జైలుకు వెళతాడు. వెళ్లేముందు అంతా అమర్ చూసుకుంటాడు అని చెబుతాడు. అది అతని అన్నకు నచ్చదు. ఈ గ్యాప్ లో శక్తిరాజుకు వ్యతిరేకంగా సొంత మనుషుల్లోనే ఓ వర్గం తయారవుతుంది. జైలు నుంచి వచ్చిన తర్వాత కైలాష్ మానససరోవరం వెళ్లిన అతన్ని కాల్చి ఆ మంచు కొండల్లో పడేస్తారు. మరి ఆ తర్వాతేమైంది.. శక్తిరాజు చనిపోయాడా..? అతను చనిపోవడంలో అమర్ పాత్ర ఏంటీ..? ఎందుకు అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

ఈ కాంబినేషన్ పై ఉన్న అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిన సినిమా ఇది. కథ, కథనాలు ఏ మాత్రం ఆకట్టుకోవు. ఎక్కడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కనిపించదు. అసలు ఈ కంటెంట్ ను వీళ్లు ఎలా ఎంచుకున్నారా అనిపిస్తుంది. థగ్ లైఫ్ అనే టైటిల్ చూసి భారీ యాక్షన్ లేదా ఇంకేదైనా ఎక్స్ పెక్ట్ చేసి వెళితే మరింత డిజప్పాయింట్ అవుతారు. దొంగలు, గ్యాంగ్ స్టర్స్ లైఫ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుంది... అయిన వాళ్లే అంతం చేయడానికి ఎలాంటి కుట్రలు పన్నుతారు.. వారి జీవితం నిత్యం ప్రమాదం అంచునే ఉంటుందనే పాయింట్ ను చెప్పాలనుకున్నాడేమో దర్శకుడు. కానీ ఆ చెప్పే క్రమంలో రాసుకున్న స్క్రీన్ ప్లే నిరాశపరుస్తుంది. ముఖ్యంగా కమల్ హాసన్ పాత్ర పూర్తిగా అవుట్ డేటెడ్ లా అనిపిస్తుంది. ఆయన వయసుకు సరిపోని పాత్ర ఇది. నటనతో చాలా పాత్రలు గొప్పగా చేశాడాయన. బట్ ఈ సారి చప్పగా ఉంది. ఫోర్స్ డ్ యాక్టింగ్ లా కనిపిస్తుంది. శింబు సైతం ఏదో మొహమాటానికి ఈ పాత్ర ఒప్పుకున్నాడా అనిపించేలా నీరసంగా నటించాడు. ట్రైలర్ లో అభిరామితో లిప్ లాక్ చూసి ఎంత మంచి సీనో అయి ఉంటుందనుకుంటే.. అది అనవసరంగా ఉంటుంది. ఇక త్రిష ఈ సినిమాలో ఓ వేశ్య. ఆ గృహం నుంచి తప్పించి తను కీప్ గా పెట్టుకుంటాడు శక్తిరాజు పాత్రధారి అయిన కమల్. ఆ తర్వాత ఆమెను తను బలవంతంగా తీసుకువెళతాడు.. కమల్ కు కొడుకులాంటి అమర్ పాత్రధారి అయిన శింబు. ఇది చాలు.. వీళ్లు ఎంత గొప్ప కథ రాసుకున్నారో చెప్పడానికి. తనను కొడుకులా భావించిన వ్యక్తి కీప్ ను కామించిన మరో గ్యాంగ్ స్టర్ అతను. ఆ పాత్రలో త్రిష ఇందులో తన ప్రమేయం ఏం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అస్సలు విలువ లేని పాత్ర ఇది. అభిరామి మొదట్లో సీరియస్ గా కనిపించినా తర్వాత పాత్రకే మతిభ్రమించింది.. సినిమా చూశాక ప్రేక్షకుల పరిస్థితి కూడా అంతే అవుతుందనుకోండి.. ఓ రకంగా ఆధిపత్యం కోసం సాగే వెన్నుపోటు కథ ఇది.

మణిరత్నం దర్శకుడుగా గాడి తప్పి చాలా రోజులైంది. పొన్నియన్ సెల్వన్ తమిళుల చరిత్ర కాబట్టి అక్కడి వరకే ఆడింది. ఈ సారి మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు అతను. కమల్ సైతం రిటైర్మెంట్ కు చాలా చాలా దగ్గరగా కనిపిస్తున్నాడు.

కమల్ లో వృధ్యాప్య ఛాయలు ఎక్కువగా కనిపించాయి. అలాంటి వ్యక్తి రొమాన్స్ చేయాలనుకోవడమే ఎబ్బెట్టుగా మారింది. తెలుగు డబ్బింగ్ సైతం పళ్లూడిపోయిన ముసలి వ్యక్తిలా చెప్పాడు. అంటే అతను కూడా రజినీకాంత్ లాగా తన ఏజ్ కు తగ్గ పాత్రలకే పరిమితం అయితే ఇంకా బావుంటుందేమో.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. రహమాన్ నుంచి రెండు పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ యావరేజ్. ఎడిటింగ్ ఓకే. తెలుగు డైలాగ్స్ అక్కడక్కడా మెప్పించాయి. ఓవరాల్ గా ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఇతర పాత్రల డబ్బింగ్ బావుంది. దర్శకుడుగా ఒకప్పుడు లెజెండ్ అనిపించుకున్న మణిరత్నం పూర్తిగా తేలిపోయాడు అని చెప్పడానికి బాధ అనిపించినా.. అదే నిజం.

ఫైనల్ గా : కథ,కథనంలో కనిపించని లైఫ్

రేటింగ్ : 2/5

- బాబురావు కామళ్ల

Full View

Tags:    

Similar News