Veera Simha Reddy Movie Review: సంక్రాంతి సంబరాలు అదరహో.. బాలయ్య హిట్ కొట్టాడహో..
Veera Simha Reddy Movie Review: సంక్రాంతి సినిమాల్లో తిరుగులేని రికార్డ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ టాప్ లో ఉంటాడు. ఈ సారి మళ్ళీ బాలయ్య సంక్రాంతి పండుగ రేసులోకి వీరసింహారెడ్డితో వచ్చాడు.;
Veera Simha Reddy Movie Review: సంక్రాంతి సినిమాల్లో తిరుగులేని రికార్డ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ టాప్ లో ఉంటాడు. ఈ సారి మళ్ళీ బాలయ్య సంక్రాంతి పండుగ రేసులోకి వీరసింహారెడ్డితో వచ్చాడు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ, క్రాక్ సూపర్ సక్సెస్ తర్వాత గోపిచంద్ మలినేని కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన సినిమా కావడంతో ముందు నుంచి వీరసింహారెడ్డిపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇవాళ భారీగా రిలీజైన వీరసింహారెడ్డి ఆ అంచనాలను అందుకుందా లేదా... రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే... జై సింహారెడ్డి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఓ రెస్టారెంట్ నడుపుతుంటాడు. తల్లితో కలసి అక్కడే జీవిస్తున్న జై... ఇషాతో ప్రేమలో పడతాడు. పెళ్ళి విషయం చర్చలకు వచ్చే టైమ్ కి తండ్రి వీరసింహారెడ్డి గురించి తెలుసుకుంటాడు. తండ్రికి దూరంగా జై సింహారెడ్డిని ఎందుకు పెంచాల్సి వచ్చింది.? కుటుంబం కోసం ఇస్తాంబుల్‌కి వచ్చిన వీరసింహారెడ్డికి అక్కడ ఏం జరిగింది. పులిచర్లలో ప్రజలంతా దేవుడుగా కొలిచే వీరసింహారెడ్డి కుటుంబంలో జరిగిన సంఘటనలు ఏంటనేది మిగతా కథ.
బాలకృష్ణ డైలాగ్స్ లో పదును.. బాడీ లాంగ్వేజ్ లో వేగం.. గెటప్ లో కనిపించే స్వాగ్.. ఇవన్నీ బాలకృష్ణ అభిమానులకే కాదు.. మాస్ సినిమాలను ఇష్టపడే సగటు ప్రేక్షకులకు కూడా అదుర్స్ అనిపిస్తాయి. బాలకృష్ణ బలాలను తూకం వేసి రాసుకున్న కథలో వీర సింహా రెడ్డిగా బాలయ్య చెలరేగిపోయాడు. వీరసింహారెడ్డి ఇంట్రడక్షన్ ఫైట్ నుండి పెరిగిన హైప్ ని మెయిన్ టైన్ చేయడంలో దర్శకుడు గోపీచంద్ మలినేని సక్సెస్ అయ్యాడు. బాలకృష్ణ ఫ్యాన్ గా అతను డిజైన్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్ కి జాతరగా మారాయి. ఈ విషయంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌కి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
వీరసింహారెడ్డిగా బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ హైలైట్ గా నిలిచింది ఈ సినిమాలో. ఇక డైలాగ్స్ తూటాల్లా పేలాయి. టిడిపి పార్టీ శ్రేణులకు ఊపు తెచ్చే పోలిటికల్ పంచ్ డైలాగ్స్ తో బాలకృష్ణ చెలరేగిపోయాడు. వాళ్ళు వెదవలయినా ఆ స్థానంలో కూర్చోబెట్టిన ప్రజల తీర్పును గౌరవించాలి.. అభివృద్ది అంటే నిర్మించడం.. కూల్చడం కాదు.. వంటి డైలాగ్స్‌తో పొలిటికల్ హీట్ ని రాజేసాడు బాలకృష్ణ. మధ్యలో శృతీహాసన్‌తో చిన్న లవ్ ట్రాక్... సుగుణ సుందరీ అనే సాంగ్ తో ఫస్ట్ హాఫ్ హైప్ తో నడిచి ప్రేక్షకులను మెప్పించింది.
వీరసింహారెడ్డి కథలోని ఎమోషన్స్ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర చాలా ముఖ్యమైనది. బాలకృష్ణకు చెల్లెలుగా అన్నను అపార్దం చేసుకొని ఢీ కోట్టే పవర్‌ఫుల్ పాత్రలో వరలక్ష్మి .. బాలకృష్ణతో పోటీ పడి నటించింది. దునియా విజయ్ ప్రతాప్ రెడ్డిగా నెగిటివ్ రోల్ ని చాలా సమర్ధవంతంగా పోషించాడు. అజయ్ ఘోష్ డైలాగ్స్ పేలాయి. దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి ని గుర్తు చేసాడు. ప్రేమ అపార్దం గా మారితే జరిగే అనర్దాలు వీరసింహారెడ్డి కథలో మలుపులకు కారణం అవుతాయి. పరిస్థితులు కారణం అయితే వాటి తాలూకు భావోద్వేగాలు పండించడంలో బాలకృష్ణ, వరలక్ష్మి పీక్స్ కి తీసుకెళ్లారు. కథలో మాస్ ఎలిమెంట్స్ పతాక స్థాయిలో ఉంటే అన్నా చెల్లిళ్ళ సెంటిమెంట్ కూడా అదేస్థాయిలో ఉంటుంది.
వీరసింహారెడ్డిగా తన అభిమాన హీరో బాలకృష్ణను చాలా పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. ఒక ఫ్యాన్ అయితే బాలయ్యను ఎలా తెరపై చూడాలనుకుంటాడో దానికి పది రెట్లు ఎక్కువగా చూపించడంతో సక్సెస్ అయ్యాడు. ఇక తమన్ మ్యూజిక్ వీరసింహారెడ్డికి చాలా ప్లస్ అయ్యింది. సుగుణ సుందరీ, జై బాలయ్య, బావ మనోభావాలు, మాస్ మొగుడు పాటలు థియేటర్స్ లో విజిల్స్ కొట్టించాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే తమన్ ఇరగదీశాడు. మొత్తంగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు.. బులెట్స్ లా తగిలే డైలాగ్స్.. తో వీరసింహా రెడ్డి ఈ సంక్రాంతి సీజన్లో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.