CMS 03 Satellite: : 4,410 కిలోల భారీ శాటిలైట్‌ ప్రయోగం నేడు

నేవీకి తోడ్పాటు అందించనున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహం

Update: 2025-11-02 00:30 GMT

బాహుబలి వంటి అత్యంత ఎత్తయిన రాకెట్‌తో ఇస్రో ఆదివారం ఓ భారీ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతున్నది. ఆదివారం సాయంత్రం శ్రీహరి కోటలోని ప్రయోగ కేంద్రం నుంచి 4,410 కిలోల బరువున్న కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ‘సీఎంఎస్‌-03’ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నది. ఇందుకోసం 43.5మీటర్ల ఎత్తున్న ‘ఎల్‌వీఎం3-5’ రాకెట్‌ను ఉపయోగిస్తున్నది. ఇంత బరువైన శాటిలైట్‌ను భారత్‌ నుంచి ప్రయోగించటం ఇదే మొదటిసారి. భారత భూభాగం సహా భూమిపై సముద్ర ప్రాంతాలకు సంబంధించి కీలక సమాచారాన్ని, బహుళ ప్రయోజనాలతో కూడిన వివిధ రకాల సేవల్ని ‘సీఎంఎస్‌-03’ అందించనున్నది.

హిందూ మహాసముద్రంలో దేశ ప్రయోజనాలను రక్షించుకోవడం, వ్యూహాత్మక పైచేయి సాధించడం భారత్‌కు అత్యంత కీలకం. ఈ దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం ప్రయోగిస్తున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహం కీలక ముందడుగు! సాగరంలో మోహరించిన మన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నేల మీదున్న నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్‌ తోడ్పాటు అందిస్తుంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళ కదలికలకు చెక్‌ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. 4,410 కిలోల ఈ ఉపగ్రహం.. భారత భూభాగం నుంచి భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకీ అత్యంత బరువైందిగా గుర్తింపు పొందనుంది.

  • సీఎంఎస్‌-03.. ఒక బహుళబ్యాండ్‌ ఉపగ్రహం. దేశవ్యాప్తంగా, ఉపఖండం చుట్టూ విస్తరించిన సువిశాల సాగర ప్రాంతంలో టెలికమ్యూనికేషన్‌ సేవలను మెరుగుపరచడం దీని ఉద్దేశం. ప్రధానంగా భారత నౌకాదళం కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. దీన్ని జీశాట్‌-7ఆర్‌ అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్‌-7 స్థానంలో దీన్ని ప్రయోగిస్తున్నారు.
  • సీఎంఎస్‌-03లో స్వర, డేటా, వీడియో కమ్యూనికేషన్లు రహస్యంగా, భద్రంగా సాగేందుకు సి, ఎక్స్‌టెండెడ్‌ సి, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. విదేశీ కమ్యూనికేషన్‌ సేవలపై ఆధారపడటాన్ని ఈ ఉపగ్రహం తగ్గిస్తుంది.
  • యుద్ధనౌకలు, విమానాలు, తీర ప్రాంతంలోని స్థావరాల మధ్య భద్రమైన కమ్యూనికేషన్‌ లింక్‌లకు మార్గం సుగమం చేస్తుంది. టెలికం సంధానత పెరుగుతుంది. మెరుగైన, అధిక సామర్థ్య బ్యాండ్‌విడ్త్‌ను ఇది అందిస్తుంది. మారుమూల ప్రాంతాలకు డిజిటల్‌ సేవల లభ్యత పెరుగుతుంది. దీనివల్ల వ్యూహాత్మక అవసరాలతోపాటు పౌర సంస్థలకూ ప్రయోజనం కలుగుతుంది.
  • శత్రు దళాలు మన కమ్యూనికేషన్‌ను జామ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ ఉపగ్రహం అడ్డుకుంటుంది. తీరప్రాంత భద్రత, సముద్ర దొంగతనాలను నిరోధించే ఆపరేషన్లు, విపత్తు సహాయ చర్యలకు ఇది సాయపడుతుంది.
  • ఇది భారత తీరం నుంచి 2వేల కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించిన సాగరజలాల్లో సేవలు అందించగలదు.

గతంలో ..

సైనిక ఉపగ్రహాల అవసరాన్ని 1999 నాటి కార్గిల్‌ యుద్ధసమయంలో భారత్‌ గుర్తించింది. నాడు ఈ తరహా శాటిలైట్లు మన వద్ద లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. యుద్ధ ప్రాంత పరిశీలనకు.. ఇతర దేశాలు అందించిన పాత చిత్రాలపై ఆధారపడాల్సిన వచ్చింది. దీనికితోడు సోవియట్‌ హయాం నాటి మిగ్‌-25ఆర్‌ యుద్ధవిమానాలను వాయుసేన నుంచి ఉపసంహరించాక చాలా ఎత్తు నుంచి ఫొటోలు తీయడానికి ఉపగ్రహాలపై ఆధారపడక తప్పని పరిస్థితి భారత్‌కు ఎదురైంది.

ఈ నేపథ్యంలో సైనిక అవసరాల కోసం రోదసిని ఉపయోగించేందుకు స్పేస్‌ బేస్డ్‌ సర్వైలెన్స్‌ ఫేజ్‌-1 ప్రాజెక్టుకు కేంద్రం 2001లో ఆమోదం తెలిపింది. దీనికింద పలు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 2013లో ఫేజ్‌-2కు అనుమతి లభించాక మరికొన్ని శాటిలైట్లను ప్రయోగించింది.

ప్రస్తుతం సైనిక అవసరాల కోసం మన దేశం 9 శాటిలైట్లను నిర్వహిస్తోంది. వీటిలో జీశాట్‌-7, జీశాట్‌-7ఏలు పూర్తిగా సైనిక అవసరాలకే వినియోగిస్తోంది. హైసిస్, కార్టోశాట్, ఎమిశాట్, రీశాట్, ఈవోఎస్‌ వంటి వాటిని అటు సైనిక, ఇటు పౌర అవసరాలకు ఉపయోగిస్తోంది. మిలటరీ కోసం మరో ఆరు శాటిలైట్లను త్వరలో ప్రయోగించనుంది.

Tags:    

Similar News