Old woman Bullet ride: అరవై ఏళ్ల వయసులో బెనెల్లీ బైక్ పై బామ్మ
ఆశ్చర్యపరుస్తున్న కోయంబత్తూరు వృద్ధురాలు
అరవై ఏళ్ల వయసులో బైక్ నడపడం నేర్చుకుని యువకులతో పోటీపడుతూ ఆశ్చర్యపరుస్తుందో బామ్మ! తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన లతా శ్రీనివాసన్ బండి నడపడం కేవలం రెండు రోజుల్లోనే నేర్చేసుకున్నారు. ఆ వయసులో చాలామంది ఇంటికే పరిమితమవుతుంటారు. కానీ లతా శ్రీనివాసన్ మాత్రం ఉత్సాహంగా బైక్ నడపడం నేర్చుకున్నారు. కేఫే క్రూయిజర్స్ మోటార్ సైకిల్ అకాడమీలో యువతీయువకులతో కలిసి శిక్షణ తీసుకున్నారు. మొదటి రోజే క్లచ్, బ్రేక్, గేర్ మార్చడం వంటి ప్రాథమిక విషయాలన్నీ నేర్చుకున్న లతా శ్రీనివాసన్.. రెండో రోజు ఎంతో బరువుండే బెనెల్లీ బైక్ ను స్మూత్‌గా నడిపి ట్రైనర్లను సైతం ఆశ్చర్యపరిచారు.
గతంలో ఓ కార్పొరేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేసిన లతా శ్రీనివాసన్ కు చిన్నప్పటి నుంచే బైక్ రైడ్ చేయాలని కోరిక. అయితే, ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆమె చెప్పారు. అయితే సైక్లింగ్ పై తనకు అనుభవం ఉందన్నారు. గతంలో ఒక్కరోజులో 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కి రికార్డ్ నెలకొల్పినట్లు చెప్పారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక బైక్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మోటార్ సైకిల్ అకాడమీలో చేరి సీరియస్ గా బైక్ నేర్చుకోవడం ప్రారంభించానన్నారు. ప్రస్తుతం బెనెల్లీ బైక్ పై రైడ్ చేస్తూ తోటి వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.