Legendry Bikes : ఒకప్పుడు కుర్రాళ్ల గుండెచప్పుడు..నేటికీ చెక్కుచెదరని ఐదు లెజెండరీ బైక్స్ ఇవే.
Legendry Bikes : భారతదేశ రోడ్లపై ఒకప్పుడు రాజసం ఒలికించిన బైక్స్ ఎన్నో ఉన్నాయి. అవి కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు, అప్పట్లో కుర్రాళ్ల గుండెచప్పుడు. బుల్లెట్ గంభీరమైన శబ్దం నుంచి యమహా ఆర్‌ఎక్స్ 100 స్పీడు దాకా.. ప్రతి బైకు ఒక చరిత్రను సృష్టించింది. కాలం మారుతున్నా, కొత్త మోడళ్లు వస్తున్నా ఈ లెజెండరీ బైకులపై ఉన్న క్రేజ్ మాత్రం అణువంతూ తగ్గలేదు. ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో వీటికోసం లక్షలు పోసేందుకు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారంటే వీటి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసే ఐదు అద్భుతమైన బైకుల గురించి తెలుసుకుందాం.
భారతీయ మోటార్‌సైకిల్ చరిత్రలో యమహా ఆర్‌ఎక్స్ 100 ఒక సంచలనం. 1985 నుంచి 1996 వరకు ఉత్పత్తి అయిన ఈ బైక్, తన తేలికపాటి బరువు, అద్భుతమైన వేగంతో యువతను ఊపేసింది. 100 సీసీ టూ-స్ట్రోక్ ఇంజన్‌తో ఈ బైక్ చేసే శబ్దం ఇప్పటికీ కుర్రాళ్లకు పూనకాలు తెప్పిస్తుంది. జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారైన ఈ బైక్, పవర్-టు-వెయిట్ రేషియోలో అప్పట్లో దీనికి సాటి మరేదీ లేదు. నేటికీ రీ-స్టోర్ చేసిన ఆర్‌ఎక్స్ 100 బైకులు మార్కెట్‌లో లక్ష రూపాయల పైనే పలుకుతున్నాయంటే దీనికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.
ఇక స్పోర్ట్స్ బైక్ అంటే ఎలా ఉండాలో చూపించింది హీరో హోండా కరిష్మా జెడ్ఎంఆర్. 2012 ప్రాంతంలో ఇది కుర్రాళ్ల డ్రీమ్ బైక్. 223 సీసీ ఇంజన్‌తో, అప్పట్లోనే 20 బీహెచ్‌పీ పవర్‌ను ఇచ్చే ఈ కారు లాంటి ఫీచర్లు ఉన్న బైక్ అంటే అందరికీ ఆసక్తే. ఫుల్ ఫెయిరింగ్ లుక్, డిజిటల్ మీటర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ వంటి ఫీచర్లతో 129 కిమీ వేగంతో దూసుకుపోయేది. హృతిక్ రోషన్ నటించిన ప్రకటనలు ఈ బైక్ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నేటికీ లాంగ్ రైడ్స్ వెళ్ళే వారికి కరిష్మా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఒక మతం అని భావించే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా 1968 రాయల్ ఎన్‌ఫీల్డ్ జీ2 బుల్లెట్ ఒక లెజెండ్. పాత కాలపు కాస్ట్-ఐరన్ ఇంజన్, అది చేసే డుగ్ డుగ్ శబ్దం ఒక విలాసానికి చిహ్నం. గ్లోబల్ మార్కెట్‌లో ఎక్కువ కాలం ఉత్పత్తిలో ఉన్న బైకుల్లో ఇది ఒకటి. కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ వాడిన తర్వాత ఈ పాత మోడల్ బుల్లెట్లకు మళ్ళీ విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇది కేవలం బైక్ మాత్రమే కాదు, భారతీయ ఆర్మీ మరియు పోలీస్ వ్యవస్థకు ఒక ఆభరణం లాంటిది.
వేగానికి మారుపేరుగా నిలిచింది యామహా ఆర్‌డీ 350. 1980వ దశకంలో ఎస్కార్ట్స్ ద్వారా రాజ్ దూత్ 350గా మన ముందుకు వచ్చింది. 347 సీసీ ప్యారలల్-ట్విన్ టూ-స్ట్రోక్ ఇంజన్‌తో ఇది రోడ్లపై రాకెట్‌లా దూసుకెళ్లేది. ఆ రోజుల్లో ఇది చాలా ఖరీదైనది, తక్కువ మైలేజీ ఇచ్చేది, అయినప్పటికీ రేసర్లు, ధనవంతులు దీనికోసం క్యూ కట్టేవారు. నేడు ఈ బైక్ యజమాని అని చెప్పుకోవడం ఒక గౌరవంగా భావిస్తారు. అలాగే 1994లో వచ్చిన టీవీఎస్ సుజుకి సమురాయ్ తన విశ్వసనీయతతో మధ్యతరగతి ప్రజలకు చేరువైంది. నో ప్రాబ్లం అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ బైక్ నేటికీ పల్లెటూళ్లలో గట్టిగా తిరుగుతూనే ఉంది.