Budget 2026 : టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్‌లో ఇలా ఫ్రీగా బడ్జెట్ స్పీచ్ చూసేయండి.

Update: 2026-01-30 10:00 GMT

Budget 2026 :ఫిబ్రవరి 1, 2026.. ఈసారి ఆదివారం కావడంతో సెలవు ఎంజాయ్ చేద్దామనుకునే వారికి కూడా బడ్జెట్ టెన్షన్ పట్టుకుంది. నిర్మలమ్మ తన ఎర్రటి బ్యాగులో నుంచి ఈసారి ఎలాంటి వరాలు కురిపిస్తారు? మధ్యతరగతి జేబులు నిండుతాయా లేదా చిల్లు పడతాయా? అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ చారిత్రాత్మక బడ్జెట్‌ను మీరు ఎక్కడున్నా సరే లైవ్‌లో ఎలా చూడాలో, ఏ సమయానికి సిద్ధంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం.

ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. సాధారణంగా బడ్జెట్ పనిదినాల్లో వస్తుంది, కానీ చరిత్రలో తొలిసారిగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెడుతుండటం గమనార్హం. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. సుమారు 60 నుంచి 90 నిమిషాల పాటు సాగే ఈ ప్రసంగంలో ఆదాయపు పన్ను రాయితీలు, కొత్త పథకాలు, వివిధ రంగాలకు కేటాయింపుల గురించి స్పష్టత రానుంది. ఈ ఆదివారం మీరు ఏదైనా ఊరు వెళ్తున్నా లేదా టీవీ అందుబాటులో లేకపోయినా అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

నేటి టెక్నాలజీ యుగంలో బడ్జెట్‌ను లైవ్‌లో చూడటం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా సంసద్ టీవీ లేదా దూరదర్శన్ అధికారిక యూట్యూబ్ ఛానెల్స్‌లో లైవ్‌ను వీక్షించవచ్చు. వీటితో పాటు అన్ని ప్రధాన వార్తా సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్‌లో కూడా బడ్జెట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా మీరు బడ్జెట్ ప్రసంగం ముగియగానే పూర్తి పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.

బడ్జెట్‌కు రెండు రోజుల ముందే, అంటే జనవరి 29న ఆర్థిక సర్వేని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సర్వే గతేడాది దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వివరించడమే కాకుండా, వచ్చే ఏడాది దేశ వృద్ధి రేటు ఎలా ఉండబోతుందో అంచనా వేసింది. దీని ప్రకారం దేశ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంపై ఇన్వెస్టర్లు, నిపుణులు, సామాన్య పౌరులు తమ ఆశలన్నీ పెట్టుకున్నారు.

ఆదివారం ఉదయం 11 గంటల నుంచి నిర్మలమ్మ ప్రసంగం ముగిసే వరకు సోషల్ మీడియాలో కూడా బడ్జెట్ ట్రెండ్ కానుంది. ఒకవేళ మీరు లైవ్ చూడలేకపోయినా, వివిధ వార్తా వెబ్‌సైట్లలో లైవ్ బ్లాగ్ ద్వారా కూడా ముఖ్యమైన అంశాలను చదువుకోవచ్చు. మొత్తానికి ఇంటి నుంచే లేదా ప్రయాణంలో ఉండి కూడా బడ్జెట్ విశేషాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్ మీకు ఒక వరంగా మారింది.

Tags:    

Similar News