సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ( Akhilesh Yadav ) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్నౌజ్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఆయన ఎంపీగా కొనసాగుతానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందిన పార్టీ సీనియర్ నేత అవధేశ్ ప్రసాద్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి పంపారు. ఇటీవల యూపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది.
త్వరలో కర్హల్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కూడా ఆయన నేతలతో చర్చించారు. కర్హాల్ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అఖిలేష్‌తో పాటు ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఎస్పీ ఎమ్మెల్యే అవధేష్ ప్రసాద్ కూడా రాజీనామా చేశారు.
అఖిలేష్ యాదవ్ 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పట్నించి రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు. తదుపరి ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పార్టీకి మేలు జరిగేలా, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచే విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు.